Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఏపీలో విపక్షాలు పాటిస్తున్న బంద్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఆలోచించాలని ఆయన కోరారు. మనల్నిమనం శిక్షించుకోరాదని, మనకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని సూచించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖ అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విపక్షాల బంద్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. మన నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలని, అందుకే అరగంటసేపు నిరసనలో పాల్గొని, అధికంగా మరో గంటపాటు పనిచేయాలని కోరారు. అనంతరం నీరు-ప్రగతి, వ్యవసాయం గురించి మాట్లాడారు. అందరి భాగస్వామ్యంతో జలసంరక్షణ, నీరు-ప్రగతి విజయవంతమైందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తంచేశారు.
కర్నూలులో భూగర్భ జలమట్టం 21 మీటర్ల నుంచి 15 మీటర్లకు పెరిగిందని, ఇది నీరు-ప్రగతి విజయమని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచే రైతులకు సాగునీరు అందించాలని, సకాలంలో సేద్యం పనులు పూర్తిచేయాలని, రెయిన్ గన్స్ ముందస్తుగా సిద్ధంచేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సేద్యం ప్రణాళికలు పటిష్టంగా అమలుచేయాలని, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని, సూక్ష్మపోషకాలు రైతులకు ఉచితంగా అందజేయాలని సూచించారు. సూక్ష్మ పోషకాల వినియోగం వల్ల వివిధ పంటల దిగుబడులు పెరిగాయని, అంతర్జాతీయంగా మేలైన పద్ధతులు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని కోరారు. విజయవాడ-గన్నవరం విమానాశ్రయం రహదారి సుందరీకరణను ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. ఇదే తరహాలో గుంటూరు వరకు సుందరీకరణ చేపట్టాలని, దీన్ని నమూనాగా తీసుకుని అన్ని జిల్లాల్లో రహదారుల సుందరీకరణ చేపట్టాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఎక్కడికక్కడ చలివేంద్రాలు నిర్వహించాలని, వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.