కేసీఆర్ తనపైన చేస్తున్న విమర్శలకి ధీటైన సమాధానాలు ఇవ్వకుంటే తెలంగాణాలో టీడీపీ మనుగడ ఎలా ఉండబోతుందో చంద్రబాబు నాయుడు కి తెలియని విషయమేమి కాదు. అందుకే కేసీఆర్ తన పైన ఎక్కుపెడుతున్న పలు విమర్శలకి తనదైన శైలిలో కఠినంగానే సమాధానాలు ఇస్తున్నారు చంద్రబాబు. హైదరాబాద్ ని చంద్రబాబు నిర్మించాడంటా అని చంద్రబాబు ని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన కేసీఆర్ కి తగిన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ నియోజకవర్గం లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ధీటుగానే సమాధానాలు ఇచ్చారు.నేను హైదరాబాద్ ని నిర్మించానన్న మాట ఎప్పుడూ అనలేదు. సైబరాబాద్ మాత్రమే నిర్మించానని అన్నాను. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. మరి కేసీఆర్ చెవుల్లోకి ఇంకోలా ఎలా దూరిందో ఆయనకే తెలియాలి.
ప్రపంచ దేశాలన్నీ తిరిగి హైదరాబాద్ కి ఐటీ కంపెనీలని తెచ్చింది నేను. తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లోనే ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మంజీరా జలాలు వచ్చాయన్న విషయం ప్రజలు మరిచిపోలేదు అని నేను విశ్వసిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కి అప్పగించేటప్పుడు మిగులు తో ధనిక రాష్ట్రంగా ఉందంటే కారణం ఇవన్నీ సమకూర్చిన నేనే అని గర్వంగా చెప్పగలను. అలాంటిది తన ఇష్టారాజ్య పాలనతో లక్షల కోట్ల అప్పుల్లొకి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసిన కేసీఆర్ ని ప్రజలు క్షమించకూడదు. రానున్న ఎన్నికల్లో మీరు కేసీఆర్ ని తరిమికొడితే, దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న మోడీ అనే కేసీఆర్ దోస్త్ ని కాంగ్రెస్ తో కలిసి, మేము సాగనంపుతాము అని పేర్కొన్నారు. ఇలా కేసీఆర్ పైన సంధిస్తున్న చంద్రబాబు విమర్శల్లో నిజం ఎంత అని చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్లో నిజాలు లేకపోలేదు. నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందాన చంద్రబాబు ఊరికే విమర్శలు చేయరు కదా.
సిబిఐ చార్జిషీటులో తన పేరుని మోడీతో స్నేహం కలిపి కేసీఆర్ తొలగించుకున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు మళ్ళీ చంద్రబాబు నోటివెంట వింటున్నామంటే ఏమో నిజమే కదా అని ప్రజలకు అనిపించొచ్చు. కానీ, ఉన్న ఆ ఆధారాలేవో ప్రజల ముందు ఉంచితే ప్రజకూటమి కి కలిసొచ్చే అంశమే కదా. అయినా ఎందుకు సమయం వచ్చినప్పుడు బయటపెడతామని నాన్చుడు యవ్వారం చేయడానికి గల కారణం ఏమయ్యి ఉంటుందా అని ఆలోచన మొదలెడితే ఎవరు చెప్పేది నిజమో అని తేల్చడానికి ఇప్పుడున్న సమయం కూడా సరిపోదేమో. గతం తో పోలిస్తే, ఇప్పుడు ప్రజా ఆశీర్వాద సభల్లో మెతకగా ప్రసంగిస్తున్న కేసీఆర్ వైఖరిని గమినించిన ఎవరికైనా కేసీఆర్ ఓటమి గురించి భయపడుతున్నారా అనిపించడం ఖాయం.