ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓ నియోజకవర్గం కావాలి . ఏపీ , తెలంగాణ తో పాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు తల్చుకుంటే ఎక్కడైనా పోటీ చేయగలరు. అలాంటి బాబుకి ఓ నియోజకవర్గం ఎందుకు అవసరం వచ్చిందబ్బా ? అక్కడే వుంది అసలైన చిక్కుముడి. అదే లోకేష్ భవితవ్యం. వచ్చే ఎన్నికల్లో లోకేష్ కి ఓ సేఫ్ నియోజకవర్గం చూస్తున్న చంద్రబాబు ఇప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కొడుకుని నిలబెట్టాలి అనుకుంటున్నారు. దాంతో పాటు తాను జాతీయ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళేది లేదని చెప్పేందుకు ఇంకో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. అయితే ఆ స్థానం ఏంటి ? చంద్రబాబు పోటీ చేస్తాను అంటే టీడీపీ లో బలమైన నాయకులు చాలా మంది తమ స్థానాన్ని వదులుకోడానికి సిద్ధపడతారు.
కానీ అది బలమైన స్థానం కావడంతో పాటు రాజకీయంగా పార్టీకి మంచి ఊపు తెచ్చే నియోజకవర్గం అయ్యుండాలి అని బాబు ఆలోచిస్తున్నారు. ఈ దిశగా ఆయన ఈసారి ఆలోచన చేస్తున్నారు. కోస్తాలోని ఏదో ఒక జిల్లా నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని రాకతో పాటు వివిధ అభివృద్ధి పనులు భారీ ఎత్తున సాగిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక స్థానం నుంచి బాబు పోటీ చేయొచ్చట. ఇందు కోసం ఇప్పటికే హైకమాండ్ భారీ కసరత్తు చేస్తోందట. కసరత్తు పూర్తి అయ్యాక పరిస్థితుల్ని బట్టి బాబు తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ కుడి ఎడమైతే పొరపాటు లేదు అనుకుంటే తాను ఎప్పటిలాగే కుప్పం నుంచి పోటీ చేసి , తన కోసం ఎంపిక చేసుకున్న స్థానం నుంచి కొడుకు లోకేష్ ని పోటీకి దింపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తోంది. ఏదేమైనా 2019 ఎన్నికల్లో కోస్తా నుంచి బాబు కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ జాబితాలోకొన్ని లోక్ సభ స్థానాల నుంచి లోకేష్ సతీమణి బ్రాహ్మిణి పేరు వినిపించడం కొసమెరుపు.