ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అక్షర క్రమంలోనే గాకుండా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిన్న గుంటూరులో నిర్వహించిన ప్రజా చైతన్య సభలో పాల్గొన్న మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు గడ్డ ఎందరో మహనీయులను దేశానికి అందించిందని, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆక్స్ఫర్డ్ అని అమరావతి దేశంలో గొప్ప నగరంగా ఎదుగుతోందని విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఎప్పుడూ కట్టుబడే ఉందని కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం మా నుంచి విడిపోయారనీ కేంద్రం ఇస్తున్న నిధులన్నింటికి ప్రతి పైసా లెక్క అడగడం ఆయనకు నచ్చలేదని కేంద్రం పథకాలకు స్టిక్కర్లు అంటించుకుని తన పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని మోడీ పేర్కొన్నారు. రాజకీయాల్లో నా కంటే సీనియర్ ని అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని నేను ఒప్పుకుంటున్నా పార్టీ ఫిరాయించడంలో, కొత్త కూటములు కట్టడంలో, మామను వెన్నుపోటు పొడిచి సీఎం కావడంలో, ప్రజాధనాన్ని దోచుకోవడంలో ఆయనే సీనియర్ అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఎవరిని తిడతారో రేపు ఎవరి ఒళ్లో కూర్చుంటారో ఆయనకే తెలియదని కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో మౌలిక వసతులను తీర్చిదిద్దుతున్నామని ఎన్నోసార్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
అమరావతిని కొత్తగా నిర్మిస్తానని చెప్పి తన పార్టీని పునర్మించుకుంటున్నారని మోదీ విమర్శించారు. రాష్ట్రాన్ని సన్ రైజ్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని చెబుతున్న చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ని రైజ్ చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రధాని మోడీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓడితాననే భయం పట్టుకుందని… అందుకే తన కుమారుడిని ఎలాగైనా రాజకీయాల్లో సెటిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను చేసిన తప్పులను కేంద్రం మీద నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మోదీ విమర్శించారు. ఓ పక్క ఓటమి భయం, రాజకీయాల్లో కుమారుడి భవిష్యత్తు, దోచుకున్న ప్రజాధనాన్ని ఎలా దాచుకోవాలన్న భయాలతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నో పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులకు ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టేసి నిధులివ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తామిచ్చిన ప్రతి పైసాకు లెక్కలు అడుగుతున్నందునే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారని తెలిపారు. 55నెలలుగా ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని మోదీ స్పష్టం చేశారు.