Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలు వైసీపీ కి జీవన్మరణ సమస్య. ఇది అందరికీ అర్ధం అవుతున్న విషయమే. ప్రత్యర్థి పార్టీ కి చావుబతుకుల పోరాటం అంటే అది అధికార టీడీపీ కి కూడా ప్రతిష్టాత్మకమే. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గ్రహించారు. అందుకే పార్టీ శ్రేణులు నంద్యాల, కాకినాడ మత్తులో ఉండిపోకుండా అలెర్ట్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి సారించారు. అయితే ఆ పని సొంత ఇంటి నుంచే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ గా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న కొడుకు లోకేష్ ని ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించాలని బాబు డిసైడ్ అయ్యారు. లోకేష్ కి అనువైన స్థానం కోసం ఆయన జల్లెడ పట్టారు. ఈ కోవలో చంద్రగిరి, శ్రీకాళహస్తి, గుడివాడ నియోజకవర్గాల గురించి పరిశీలన కూడా జరిపారట. అయితే వాటి అన్నిటి కన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం మేలని బాబు భావిస్తున్నారట.
వచ్చే ఎన్నికల్లో లోకేష్ ని కుప్పం నుంచి గెలిపిస్తే ఆపై కూడా అక్కడ ఆయనకి ఎదురు ఉండదని బాబు అనుకుంటున్నారు. అలా కొడుకు కోసం సీట్ త్యాగం చేసాక తన పోటీ ఎక్కడ నుంచి అన్నదానిపై కూడా బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన సొంత గడ్డ నిమ్మకూరు ఉన్న గుడివాడ నియోజకవర్గం లో పోటీ చేయాలని బాబు ఆలోచిస్తున్నారట. వైసీపీ లో ఉండి పదేపదే బాబు ని టార్గెట్ చేస్తున్న కొడాలి నానికి చెక్ పెట్టడంతో పాటు కృష్ణా జిల్లాలో పార్టీ కి కొత్త ఊపు తేవడానికి ఈ పోటీ ఉపయోగపడుతుందని బాబు అనుకుంటున్నారట. ఇదే కోణంలో దసరా పండగ తర్వాత కొన్ని సర్వే టీమ్స్ టీడీపీ తరపున ఆయా నియోజకవర్గాల్లో తిరగబోతున్నాయట. బాబు ఆలోచనకి తగినట్టు సర్వే ఫలితాలు కూడా వస్తే తండ్రి చంద్రబాబు గడ్డ మీదకి కొడుకు లోకేష్ వెళతారు. అదే సమయంలో అత్తారిల్లు గుడివాడకు బాబు పోటీ చేయడం ఖాయం అనిపిస్తోంది.