Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశ చరిత్రలో తొలిసారి ఓ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో తన జన్మదినం రోజు… జన్మనిచ్చిన రాష్ట్రం కోసం చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా ఊరూవాడా తరలివచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇసుకేస్తే రాలని జనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 68 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న దీక్ష జనసంద్రంగా మారింది. ఈ ఉదయం ఏడుగంటలకు మహాత్మాగాంధీ, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఒకరోజు నిరాహార దీక్ష మొదలుపెట్టారు ముఖ్యమంత్రి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం ఆలపించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పావులూరి శివరామకృష్ణ చంద్రబాబుకు నూలుపోగు దండవేసి అభినందించారు. టీటీడి, దుర్గగుడికి చెందిన వేదపండితులు, క్రైస్తవ, ముస్లిం మతపెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు.
చంద్రబాబుతో పాటు మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారాలోకేశ్, కొల్లు రవీంద్ర, ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ తో పాటు కొందరు ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొన్నారు. నవ్యాంధ్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి ఉద్యమ శంఖారావం పూరించారని సీఎం కార్యాలయం పేర్కొంది. నవ్యాంధ్రప్రదేశ్ నమ్మకాన్ని కేంద్రం నట్టేట ముంచిందని, ఐదుకోట్ల ప్రజల్ని నిలువునా దగా చేసిందని, చెంబుడు నీళ్లు, చారెడుమట్టి మొహానకొట్టి దారుణంగా అవమానించిందని ఆరోపించింది. కేంద్రం తెలుగువాడి గుండెను రగిలించిందని, ఇలా అందరి ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదన తనదిగా భావించి జనం తరపున ముఖ్యమంత్రి ఉద్యమశంఖం పూరించారని తెలిపింది.
రాష్ట్రం పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణితో విసిగిపోయిన ముఖ్యమంత్రి పోరుబాట పట్టారని, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని తన దీక్ష ద్వారా నిలదీయనున్నారని తెలిపింది. షాంఘై కంటే ఆరింతలు, ఢిల్లీకంటే రెండింతలు పెద్దదిగా గుజరాత్ లోని అహ్మదాబాద్ కి దగ్గర్లో ధోలేరా నగరాన్ని 2.30 లక్షల ఎకరాల్లో నిర్మిస్తామని ఘనంగా ప్రకటిస్తున్న ప్రధానికి మనం 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించుకుంటామంటే అపహాస్యంగా ఉందని, ఈ వివక్షను దేశమంతటికీ అర్దమయ్యేలా చాటిచెప్పేందుకే ముఖ్యమంత్రి దీక్ష చేపట్టారని వెల్లడించింది. అటు చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలు దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రమంతా పసుపు జెండాలు రెపరెపలాడాయి. తమ తమ ప్రాంతాల్లో జరిగిన దీక్షల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పోరాటానికి మద్దతు తెలిపారు.