Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మధ్య ఏ నాయకుడు ఏ సమస్యతో సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్లినా ఓ మాట తరచుగా వినపడుతోందట… అదే “నారాయణని చూసి నేర్చుకోండి”. సీఎం చంద్రబాబుకి నారాయణ సన్నిహితుడు అయినప్పటికీ కొత్తగా ఈ మాటలు వినిపించడానికి కారణం వేరే ఉందట. కొడుకు నిషిత్ ఆకస్మిక మరణం తర్వాత నారాయణ కోలుకోడానికి చాలా టైం పడుతుందని అంతా భావించారు. చంద్రబాబు కూడా అలాగే అనుకున్నారు. కానీ కొండంత విషాదాన్ని గుండెల్లో మోస్తూ కూడా ఇటు పార్టీ, అటు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నారాయణ చురుగ్గా వ్యవహరించడం బాబునే ఆశ్చర్యపరుస్తోందట. అందుకే నారాయణ పరోక్షంలో బాబు ఆయన్ని తెగ మెచ్చుకుంటున్నారట. ఒకప్పుడు నారాయణ గురించి చంద్రబాబు చెబుతుంటే పార్టీ నేతలకు అంతగా నచ్చేది కాదంట. కానీ ఇప్పుడు నారాయణ అంకిత భావం, ఆత్మ స్థైర్యం చూసి ఇంకో మాట మాట్లాడలేకపోతున్నారట.
నారాయణ విజయానికి ఆత్మస్థైర్యమే కాదు ఆయన పారదర్శకత కూడా ప్రధాన కారణం. సహజంగా ఏదైనా రంగంలో విజయం సాధించే ఎంతోమంది గతాన్ని మరిచిపోయి వ్యవహరిస్తుంటారు. కానీ నారాయణ విషయంలో చూద్దామన్నా ఆ ధోరణి కనిపించదు. ఇంతకుముందు నారాయణ విద్యా సంస్థల అధినేతగా, ఆ తర్వాత సీఎం చంద్రబాబుకి సన్నిహితుడిగా ఆయన రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన గతం, కుటుంబ నేపధ్యం ఏ కొద్ది మందికో తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పాత విషయాల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తాజాగా ఓ సభలో ఆయన చదువు ఆవశ్యకతని వివరిస్తూ తన కుటుంబం గురించి చెప్పుకున్నారు. తన తండ్రి 3 వ తరగతి చదివి కండక్టర్ గా పని చేస్తే, తన తల్లికి అసలు ఏ మాత్రం చదువు రాదని నారాయణ తెలిపారు. అయినా వారి ప్రోత్సాహంతో బాగా చదువుకున్నందువల్లే ఇప్పుడు ఈ స్థాయి అందుకున్నట్టు చెప్పి నారాయణ విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించారు. ఏదేమైనా చంద్రబాబు చెప్పడం వల్లే కాదు నిజానికి చాలా విషయాల్లో నారాయణని చూసి నేర్చుకోవాలి అని ఎప్పటినుంచో ఆయన తో పనిచేస్తున్న ఓ చిన్న స్థాయి ఉద్యోగి కూడా వ్యాఖ్యానించాడు.