Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియా టుడే సదస్సులో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అభివృద్ధిలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు పోలికే లేదని కేసీఆర్ వెటకారంగా వ్యాఖ్యానించడంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ప్రజలు పెట్టిన పెట్టుబడులవల్లే విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందన్న విషయం కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిదంటున్నారు. విభజన వల్ల తీవ్ర అన్యాయం జరిగిన ఏపీని చిన్నచూపు చూడడం తగదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తమకు పోటీ కాదని, ఎప్పటికీ పోటీపడలేదని కేసీఆర్ వ్యాఖ్యానించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తంచేశారు. ఇవన్నీ విభజన వల్ల వచ్చిన కష్టాలని, యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉండడానికి కారణం ప్రజలు కాదని, రాష్ట్ర విభజన వల్లే ఇలా జరిగిందన్నారు. తలసరి ఆదాయం మరో రూ. 35వేలు పెరిగితేనే పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి రాగలుగుతామన్నారు. రాష్ట్ర రాజధాని అనే ఉద్దేశంతోనే ఏపీ ప్రజలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారన్నారు. తెలంగాణను ఆంధ్రపాలకులు ధ్వంసం చేశారన్న వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. 1995కు ముందు… తరువాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలంతా తిరిగి రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టే గతంలో ఏపీ ప్రజలు అక్కడకు వెళ్లారని, ఇప్పుడు వెనక్కి రమ్మనడం సరైనది కాదని వ్యక్తంచేశారు. తాను తెలంగాణ ప్రజలను కానీ, ఏపీ ప్రజలను కానీ నిందించబోనన్నారు.