Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముందు ఇస్తామని తరువాత ఇవ్వమని చెప్పిన కేంద్ర్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద తాను చేస్తున్న ఉద్యమాన్ని చంద్రబాబునాయుడు, తీవ్ర తరం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు అమరావతిలో సైకిల్ యాత్ర చేశారు. రాష్ట్రం మీద బీజేపీ చూపిన వివక్ష, పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం మీద చర్చకు కేంద్రం చేస్తోన్న దాటవేత ధోరణిని తప్పుపడుతూ ఆయన వెంకటపాలెం నుంచి అమరావతి వరకూ సైకిల్ మీద వెళ్లి నిరసన తెలిపారు. ముందుగా వెంకటపాలెం గ్రామ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బాబు అసెంబ్లీ వరకూ సైకిల్ పై బయలుదేరారు.
బాబు వెళ్తే ఇంకేముంది ఆయన వెంటనే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను సైకిళ్ళ మీద అనుసరించారు. కేవలం అమరావతిలోనే కాక ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో సైకిల్, మోటార్ సైకిల్ యాత్రలకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెదేపా ఎంపీలు వీరోచిత పోరాడుతున్నారని, ఎంపీల మానవహారానికి వైసీపీ గైర్హాజరు కావడం వారి వారి లోపాయికారీ ఒప్పందాలకి మరో నిదర్శనమని అన్నారు.
ఎంపీల పోరాటాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు అభినందిస్తున్నారని, ఒక సంకల్పంతో తాము చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలంటే ప్రజల మద్దతు అవసరమని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను బలహీన పరచడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, అది ఎన్నటికీ సాధ్యం కాదని, తెలుగువారితో పెట్టుకుంటే ఎవరికైనా పరాభవం తప్పదని… నాడు ఎన్టీఆర్‌ను గద్దె దించాలని ప్రయత్నించిన ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని పరోక్ష హెచ్చరికలు చేశారు. విభజన ద్వారా ఏపీకి తీవ్రనష్టం కలిగించిన కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది… ‘అందుకే మోదీకి కూడా చెబుతున్నా… ఆంధ్రులతో పెట్టుకుంటే మీకూ అదే గతి పడుతుంది’ అని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.