టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు రెడీ అవుతున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. రేపు పొన్నూరు, వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్లబోతున్నారు. రేపు రాత్రికి బాపట్లలోనే టీడీపీ అధినేత బస చేయనున్నారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకోనున్నారు.
ఇన్ని రోజులు రాజకీయ కార్యకలాపాలకు చంద్రబాబు దూరంగా ఉన్నారు. ఈ మధ్య ఎంపీలతో భేటీ అయినప్పుడు పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఆ తర్వాత ఏపీలో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కోర్టుల్లో కూడా చంద్రబాబుకు పూర్తిగా క్లియరెన్స్ వస్తుండటంతో తన దృష్టిని పూర్తి స్థాయి రాజకీయలపై పెట్టబోతున్నాడు. ఇక, ఇవాళ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల తొలగింపు, చేర్చడం పై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.