Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమేనని, ఇందులో రాజకీయప్రయోజనాలకు ఎంతమాత్రం తావులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఏపీ హక్కులను సాధించేందుకే తాను ఢిల్లీ పర్యటనను చేపడుతున్నానని తెలిపారు. రాజకీయాలను హైలెట్ చేయొద్దని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే హైలెట్ చేయాలని చంద్రబాబు జాతీయ మీడియాను కోరారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రెండురోజుల ఢిల్లీ పర్యటన చేపడుతున్నట్టు తెలిపారు. ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టిసారించనున్నట్టు చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వివిధ పార్టీల సభాపక్షనేతలను కలుస్తానని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వ్యక్తిగతంగా వారికి వివరిస్తానని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, వాళ్లు ప్రకటించినవి కూడా అమలుచేయకుండా బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన హామీలకు విలువలేదా అని ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు న్యాయం చేయరు? ఆ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తన ఢిల్లీ పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు.
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 19 అంశాలు అమలుచేయాలని, పార్లమెంట్ లో ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చాలని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, పొరుగురాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేదాకా ఏపీకి కేంద్రం చేయూత నివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సంక్షోభాలే మనకు సవాళ్లని… వాటిని అవకాశాలుగా మార్చుకోవడమే మన సామర్థ్యమని చంద్రబాబు అన్నారు. ఎంపీలంతా కేంద్రం నుంచి అందాల్సిన ప్రయోజనాల కోసం పోరాడాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా రాష్ట్ర అభివృద్ది, పేదల సంక్షేమంపైనే దృష్టిపెట్టాలని దిశానిర్దేశంచేశారు. టీడీపీ చేసేది లాలూచీ రాజకీయాలు కాదని, ప్రజలకు ఉపయోగపడే రాజకీయమని చెప్పారు. వైసీపీ లాలూచీ రాజకీయాలు ప్రజలకు అర్దమయ్యాయని, ఎన్నికలంటే ఆ పార్టీకి భయమని, అందుకే పార్లమెంట్ చివరిరోజున రాజీనామాలు అంటోందని ముఖ్యమంత్రి విమర్శించారు.