Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విభజననాటి పరిస్థితులు కనపడుతున్నాయి. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కొందరు నాలుగేళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయపు విభజనతో పోలుస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ లానే ఇప్పుడు బీజేపీపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. నిజానికి విభజన బాధిత ఏపీని ఆదుకుంటామని 2014 ఎన్నికల సమయంలో మోడీ స్వయంగా హామీఇచ్చారు. కాంగ్రెస్ చేసిన అడ్డగోలు విభజనపై తీవ్ర ఆగ్రహజ్వాలలతో ఉన్న ఏపీ ప్రజలు మోడీ మాటలు నమ్మారు. టీడీపీతో పొత్తుకు ముందుకు వచ్చిన బీజేపీ ఏపీకి న్యాయం చేస్తుందని భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే మోడీ ప్రభుత్వ వైఖరి మారిపోయింది. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కించిన ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. అయినదానికీ, కాని దానికీ కొర్రీలు పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహనానికి పరీక్ష పెడుతూ వచ్చారు. దీంతో కేంద్రప్రభుత్వ వైఖరిపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం మొదలయింది.
ఏపీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ వైఖరుల్లో పెద్ద తేడా లేకపోవడాన్ని గమనించిన ప్రజలుమోడీపై వ్యతిరేకభావం పెంచుకున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రకటన కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తోంటే… అమరావతి శంకుస్థాపనకొస్తూ ప్రధాని మట్టి, నీళ్లు తీసుకొచ్చి… హాస్యాస్పదంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అయితే ప్రజల ఆగ్రహం తెలిసినప్పటికీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా చంద్రబాబు కేంద్రంతో సన్నిహిత సంబంధాలే కొనసాగించారు. ఎన్నిరకాల అవమానాలు ఎదురైనా సహనంతో ముందుకు సాగారు. ముఖ్యమంత్రి ఆలోచనను గ్రహించిన ప్రజలు కూడా సంయమనం కోల్పోకుండా భవిష్యత్ కోసం ఆశతో ఎదురుచూశారు. కానీ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ చూసిన తర్వాత ప్రజలు మునుపటిలా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి అంతా మామూలుగానే ఉన్నట్టు కనిపిస్తున్నా… త్వరలో ఈ ఆగ్రహం ఆందోళనల రూపు దాల్చే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు, నేతలు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంచారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయని, ముఖ్యంగా బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపించడంపై ప్రజల్లో ఏర్పడిన కోపాన్ని తొలగించకుంటే… టీడీపీకి చాలా నష్టం వాటిల్లుతుందని పలువురు నేతలు చంద్రబాబుకు స్పష్టంచేశారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని, వారిలో ఉన్న ఆగ్రహమే టీడీపీలోనూ ఉందని చూపడానికి ఏదో ఒకటి చేయాలని సూచించారు. బడ్జెట్ పై స్పందించలేని స్థితిలో వైసీపీ ఉందని, ఆ పార్టీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని నేతలు ఆరోపించారు. ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారని, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా… స్వాగతిస్తారని మరికొందరు నేతలు చంద్రబాబుకు చెప్పారు. అటు ముఖ్యమంత్రి కూడా ఇంకా వేచిచూసే ధోరణి అవలంబించడం సరైనది కాదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సమన్వయకమిటీ భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
బీజేపీతో మిత్రబంధంపైనా, ఆ పార్టీ వైఖరిపైనా ఆయన సూటిగానే విమర్శలుచేశారు. రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రస్తావించిన చంద్రబాబు మిగతా చోట్లా అదే పరిస్థితి తెచ్చుకోవద్దని తీవ్ర హెచ్చరిక చేశారు. పరిపాలన సక్రమంగా లేకుంటే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు అంగీకరించరని, ఈ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను ప్రస్తావించిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి అన్యాయం చేసినందునే కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో కేసీఆర్ తో, ఏపీలో జగన్ తో లాలూచీపడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని, రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీని దెబ్బతీసేందుకే రాష్ట్ర విభజనకు ప్రణాళికలు రచించిందని ఆరోపించారు. విభజన వల్ల అన్యాయం జరిగిన ఏపీకి కేంద్రంతో సంబంధాలు ఉంటే ఉపయోగమని భావించి… ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు వివరించారు.
బీజేపీతో పొత్తు కొనసాగిస్తోంది పదవుల కోసం కాదని, కేంద్ర ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు టీడీపీకి నామమాత్రంగానే ఉన్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని, ప్రత్యేక ప్యాకేజీలో కూడా ఏమాత్రం సాయం చేయలేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ దారుణంగా ఉందన్నారు. కర్నాటక, ముంబై, అహ్మదాబాద్ లకు బాగానే కేటాయింపులు చేసినప్పుడు ఏపీ పట్ల ఎందుకు చిన్నచూపు చూశారని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు ఉండాలని, తాను అందరి మనోభావాలు అర్థం చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి మేలు జరగాలన్నదే బీజేపీతో పొత్తు ఉద్దేశమని, అదే నెరవేరకపోతే ఎలాంటి నిర్ణయానికైనా సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. సమన్వయకమిటీ సమావేశం జరిగిన తీరు పరిశీలిస్తే… అతి త్వరలోనే బీజేపీతో చెలిమిపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు.