ఏపీలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ప్రజల్లోకి వస్తున్నారు. ఇక, చంద్రబాబు ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటుగా మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ అధినేత పర్యటించబోతున్నారు. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పనున్నారు. నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చంద్రబాబు చేరుకోనున్నారు.
ఇక, తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను చంద్రబాబు పరామర్శించనున్నారు. రాత్రికి బాపట్లలోనే టీడీపీ కార్యాలయంలో బస చేయనున్నారు. రేపు పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా తుఫాన్ వల్ల దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలవనున్నారు. మూడు నెలల తర్వాత చంద్రబాబు ప్రజల మధ్యకు వస్తుండటంతో ఆసక్తిగా మారింది.
అలాగే, ఏపీలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తుండటంతో పార్టీని రెడీ చేసే క్రమంలో భాగంగా చంద్రబాబు ఇక ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో టీడీపీ – జనసేన పొత్తు ఉండటంతో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ఇద్దరూ భవిష్యత్ కార్యాచరణ పైన ప్రధానంగా చర్చించారను. ఈ నెల 17న లోకేశ్ యువగళం పాద్రయాత్ర ముగింపు సభలో ఇద్దరు నేతలు పాల్గొనబోతున్నారు. సీట్ల విషయంలోనూ ఇద్దరు నేతల మధ్య ప్రాథమికంగా చర్చలు కొనసాగినట్లు సమాచారం. బీజేపీ తమతో కలిసి వస్తుం దని చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. అయితే, బీజేపీ పార్టీ నిర్ణయం పై క్లారిటీ వచ్చిన తరువాత ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సీట్ల కేటాయింపులపై చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.