ఇటీవల సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యలపై పోలీసుల విచారణ పూర్తయింది. ముగ్గురు మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేసిన ఘటనపై పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 90 రోజుల్లోనే రాచకొండ పోలీసులు మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు.
హాజీపూర్ హంతకుడు శ్రీనివాస్ రెడ్డిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ పూర్తి చేసినట్లుగా పోలీసులు కోర్టుకు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పోర్న్ వీడియోలను చూసిన శ్రీనివాస్ రెడ్డి అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.
అతడు మానసిక రోగంతో బాధపడుతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. తనలో సెక్స్ కోరికలు కలిగినప్పుడు వెంటనే మైనర్ అమ్మాయిలను ఎంచుకొని, వాళ్లకి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని పోలీసులు తేల్చారు. అత్యాచారానికి గురైన బాలికలు తమకు జరిగిన దారుణాన్ని బయట పెడితే తన పరువు పోతుందని భావించిన శ్రీనివాస్ రెడ్డి వెంటనే వారి హత్య చేసే వాడని పోలీసులు తెలిపారు.
శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకూ ముగ్గురు మైనర్లను ఇలా మాయమాటలతో నమ్మించి అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లుగా పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.