శాసనసభ ఎన్నికలు జరుగుతున్నవేళ చత్తీస్‌గఢ్ లో మరోసారి మావోయిస్టులు హింసాకాండ కొనసాగించారు. చత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్నికలకు భద్రత దళాలుగా వ్యవహరిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు ఈ దారుణకాండకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక బీఎస్ఎఫ్ జవాను మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయపడిన ఆరుగురిలో నలుగురు జవాన్లు, ఒక డీఆర్జీ మరియు ఒక సాధారణ పౌరుడు ఉన్నారని సమాచారం. వీరిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ నవంబర్ 12 న జరిగింది. ఈ రాష్ట్రంలోని మావోయిస్టులు అధికంగా ఉండే 18 నియోజకవర్గాల్లోనే ఈ తొలి విడత పోలింగ్ నిర్వహించారు. బీజాపూర్ లో జరిగిన ఎన్నికల విధులకు హాజరయ్యి తిరిగి వెళ్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతర తో పేల్చివేశారు. ఈ బీజాపూర్ లోనే కాకుండా బస్తర్, దంతెవాడ, సుక్మా, రాజానందగావ్, కాంకేర్ జిల్లాలలోని ప్రాంతాలలో కూడా భారీగా సాయుధ దళాలను మోహరించి, భారీ భద్రత నడుమ పోలింగ్ నిర్వహించారు.
ఎన్నికల ప్రారంభం కి ముందు ప్రజలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని, చేతివేలి పై సిరా చుక్క కనిపిస్తే ఆ చేతి వేలితో పాటు, చేతులని కూడా నరుకుతామని మావోయిస్టులు బెదిరించినా, ప్రజలు ఆ బెదిరింపులకు లొంగకుండా భారీ ఎత్తున ముందుకొచ్చి తమ ఓటు హక్కు ని వినియోగించుకున్నారు. దంతెవాడ జిల్లాలో గల మాదేండ గ్రామంలో 263 మంది ప్రజలు ఓటు హక్కు ని వినియోగించుకున్నారు. మరో 72 నియోజకవర్గాలకు ఈ నెల 20 న రెండో దశ ఎన్నికలు జరిపి, డిసెంబర్ 11 న ఎన్నికల ఫలితాలు విడుదలచేస్తారు.