Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమ కనుసన్నల్లో పనిచేసేవారు ఎదురుతిరిగితే పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ ఐ ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో మరోసారి రుజువయింది. అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను ఐఎస్ ఐ వెనకుండి నడిపిస్తుందన్నది అందరికీ తెలిసిన సంగతే. ఐఎస్ఐ చెప్పినట్టల్లా నడుచుకునే దావూద్ కు పాకిస్థాన్ కూడా అమిత ప్రాధాన్యం ఇస్తుంది. దావూద్ శత్రువులను తన శత్రువులగానే భావిస్తుంది. దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ విషయంలో ఇదే జరిగింది. దావూద్ కు, చోటా షకీల్ కు మధ్య విభేదాలు తలెత్తాయని, చోటా షకీల్ దావూద్ కు దూరంగా ఉంటున్నాడని, కరాచీలో సొంత కుంపటి పెట్టుకున్నాడన్న వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన విషయం వైరల్ అవుతోంది. ఛోటా షకీల్ ఇప్పుడు ప్రాణాలతో లేడన్నది కొత్తగా వినిపిస్తున్న వార్త.
షకీల్ మరణంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. 2017 జనవరి 6న షకీల్ చనిపోయాడని ఓ రిపోర్ట్ పేర్కొంటోంది. మరో రిపోర్ట్ ప్రకారం షకీల్ కు గుండెపోటు వచ్చిందని, వెంటనే అతన్ని రావల్పిండిలోని కంబైన్డ్ మెడికల్ హాస్పిటల్ కు విమానంలో తరలించగా..అక్కడ చనిపోయాడని తెలుస్తోంది. మరో నివేదిక షకీల్ మరణం వెనక ఐఎస్ ఐ హస్తం ఉందని తెలియజేస్తోంది. ఈ రిపోర్ట్ ప్రకారం దావూద్ తో విభేదాలే షకీల్ మరణానికి కారణం. దావూద్, షకీల్ కు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఐఎస్ ఐ ప్రయత్నించింది. కానీ ఛోటా షకీల్ ఐఎస్ఐ మాట వినిపించుకోలేదు. షకీల్ సొంత కుంపటి పెట్టుకుంటే… భారత్ కు వ్యతిరేకంగా తాము చేసే పనులకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఐఎస్ ఐ భయపడింది. దీంతో షకీల్ అడ్డుతొలగించింది. రెండు రోజుల తర్వాత సీ -130 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లో షకీల్ మృతదేహాన్ని కరాచీకి తరలించారు. డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ స్మశాన వాటికలో అత్యంత రహస్యంగా ఖననం చేశారు.
షకీల్ ను హతమార్చిన రెండురోజుల తర్వాత ఈ విషయాన్ని ఐఎస్ ఐ దావూద్ కు చెప్పింది. ఈ హత్య విషయం డీ గ్యాంగ్ లో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. షకీల్ మరణం తర్వాత అతని రెండో భార్యను, ఇతర కుటుంబ సభ్యులను ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి లాహోర్ లోని సురక్షితమైన నివాసానికి తరలించారు. అటు షకీల్ హత్యకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతోంది. డీ గ్యాంగ్ లోని బిలాల్ అనే వ్యక్తి కి , ముంబైలో నివసించే షకీల్ బంధువుకు మధ్య జరిగిన సంభాషణలో షకీల్ మరణం గురించి ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ క్లిప్ నిజమైనదా.. కాదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు షకీల్ మరణవార్తను ఢిల్లీలోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ కానీ, ముంబై పోలీసులు కానీ ధృవీకరించలేదు.. ఖండించనూ లేదు. దీంతో ఎక్కువమంది షకీల్ ను ఐఎస్ ఐ చంపేసిందనే నమ్ముతున్నారు. అయితే వారం రోజుల క్రితం చోటా షకీల్ జీ న్యూస్ కు రహస్య ప్రాంతం నుంచి ఇంటర్వ్యూ ఇచ్చినట్టు…ఆ ఇంటర్వ్యూలో దావూద్ తో విభేదాలను ఖండించినట్టు, ప్రాణమున్నంత వరకూ దావూద్ తో కలిసే పనిచేస్తానని చెప్పినట్టు వచ్చిన వార్తలపై ఇప్పుడు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ తప్పుడు ఇంటర్వ్యూ వెనకా ఐఎస్ఐ హస్తం ఉండిఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.