Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుత రాజకీయాల దశ, దిశ మారుస్తాయని భావిస్తున్నకర్నాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మే నెలలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ ఎన్నికల తేదీలు ప్రకటించారు. మే 12వ తేదీన మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తర్వాత మే 15న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికల కోడ్ ఇవాళ్టినుంచే అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ 27 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీపాట్ మెషీన్లను కూడా వినియోగించనున్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల ఫొటోలను కూడా ఈవీఎంలకు జతచేస్తున్నామని, దీనివల్ల ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురికాకుండా ఉంటారని ఓపీ రావత్ వెల్లడించారు.
పోలింగ్ బూత్ లో మహిళలకోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని, 450 పోలింగ్ స్టేషన్లను మొత్తం మహిళలే నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని, రాష్ట్రంతో పాటు కేంద్రప్రభుత్వానికీ ఇది వర్తిస్తుందని స్పష్టంచేశారు. అటు ఎన్నికల తేదీల ప్రకటనపై వివాదం చెలరేగింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే బీజేపీ సోషల్ మీడియాలో తేదీలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ ఐటీ శాఖ ఇన్ ఛార్జ్ అమిత్ మాల్వియా ఈ ఉదయం కర్నాటక ఎన్నికల తేదీలు ట్విట్టర్ లో వెల్లడించారు. మే 12న ఎన్నికలు జరుగుతాయి. మే 18న ఫలితాలు అని ట్వీట్ చేశారు. ఎన్నికల కమిషన్ ప్రకటించకముందే ఎన్నికల తేదీలు బీజేపీకి తెలియడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీకేజీ విషయంపై ఎన్నికల కమిషనర్ రావత్ స్పందించారు. దీనిపై తప్పకుండా విచారణ జరుపుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రావత్ తెలిపారు.