సోషల్ మీడియా భావాల వ్యక్తీకరణకు సరైన వేదిక. పత్రికలు, చానళ్లు ఎన్ని ఉన్నప్పటికీ నిత్యం సమాజంలో జరుగుతుండే ఎన్నో విషయాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చోటు దక్కదు. అలాంటి వాటన్నింటికీ సోషల్ మీడియా ప్రత్యామ్నాయంగా మారింది. ఈ క్రమంలో ఎన్నో విషయాలు సామాజిక మాద్యమాల్లో వెలుగుచూస్తూ ప్రజల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. రెండురోజులుగా హల్ చల్ చేస్తున్న కలెక్టర్, ఎస్పీల ఘటనలే ఇందుకు ఉదాహరణ. తమిళనాడు లోని ఓ కలెక్టర్, కర్నాటకలోని ఓ ఎస్పీ ఇప్పుడు సోషల్ మీడియా హీరోలు. నెటిజన్లు ఈ హీరోలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఇద్దరూ ఇంతగా వారి మనసు దోచుకోవడానికి కారణం… అత్యున్నత హోదాలో వారు చేసిన మంచిపనులే. వివరాల్లోకెళ్తే… కందస్వామి తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్. ఆయన తీరు మిగిలిన కలెక్టర్లకు భిన్నం.
సామాన్య జీవితం గడుపుతుంటారు. ఏదో మొక్కుబడిగా విధులు నిర్వహించామన్నట్టుగా కాకుండా నిత్యం ప్రజలకు ఏదో చేయాలని పరితపిస్తుంటారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక ప్రయివేట్ షూ కంపెనీ తిరువణ్నామలై జిల్లా వ్యాప్తంగా టెన్త్ లో అత్యధిక మార్కులు సాధించినవారిని బహుమతులతో ప్రోత్సహించింది. ఈ కార్యక్రమానికి కందస్వామి హాజరయ్యారు. చెయ్యూరులోని ప్రభుత్వ కాలేజ్ లో ప్లస్ టు చదువుతున్న మోనిషా అనే విద్యార్థిని గత ఏడాది టెన్త్ లో 500 మార్కులకు గానూ 491 సాధించి టాపర్ గా నిలిచింది. ఆమెను పరిచయం చేస్తూ నిర్వాహకులు మోనిషా కలెక్టర్ కావాలన్న ఆశయంతో ఉన్నట్టు చెప్పారు. కార్యక్రమం ముగిశాక కందస్వామి మెనిషాను పిలిపించి తన అధికారిక కారులో కూర్చోబెట్టారు. డోర్ దగ్గర నిల్చుని కారులో ఉన్న అమ్మాయి ఫొటో తీశారు. కలెక్టర్ కావాలన్న ఆశయం నెరవేరేవరకు ఆ ఫొటోను స్ఫూర్తిగా ఉంచుకోవాలని చెప్పారు. శిక్షణకు సంబందించి ఎలాంటి సాయం కావాలన్నా తనను సంప్రదించాలని కోరారు. కలెక్టర్ చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అలాగే కర్నాటకకు చెందిన ఓ ఎస్పీ కూడా ఇలా తన హోదాను పక్కనపెట్టి చేసిన ఓ పని ఆయన్ను సోషల్ మీడియాలో హీరోగా మార్చింది.
అణ్ణామలై కర్నాటకలోని చిక్ మంగళూరు జిల్లా ఎస్పీ. బెంగళూరుకు చెందిన కొందరు వీకెండ్ లో చిక్ మంగుళూరు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారికి అనుకోని ఆటంకం ఏర్పడింది. అర్ధరాత్రి వేళ వారు ప్రయాణిస్తున్న వాహనం మత్తావరగ్రామ సమీపంలో పంచర్ పడింది. అది దట్టమైన అటవీప్రాంతం కావడం, చిమ్మ చీకటిగా ఉండడంతో కారులోని వారంతా ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా..ఎస్పీ అణ్ణామలై అక్కడకు వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా దగ్గరలోని కొప్ప గ్రామానికి వెళ్లి తిరిగి వెళ్తున్న అణ్ణామలై రోడ్డు మీద నిలిచిపోయిన వాహనాన్ని చూసి అక్కడ ఆగారు. విషయం తెలుసుకుని తానే స్వయంగా స్పానర్ పట్టుకుని టైర్ మార్చడానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో తెలిసిన మెకానిక్ కు ఫోన్ చేసి కార్ రిపేర్ చేయాలని కోరారు. అనంతరం టూర్ కు వచ్చిన వారిని చిక్ మంగళూరులో విడిచిపెట్టారు. ఎస్పీ చేసిన సాయంపై నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ రెండు విషయాలను షేర్ చేసుకుంటూ నెటిజన్లు తమకు కూడా ఇలాంటి ఎస్పీ, కలెక్టర్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తంచేస్తున్నారు.