డెంగ్యూ తో మృతి చెందిన ‘డ్రామా జూనియర్’

డెంగ్యూ తో మృతి చెందిన 'డ్రామా జూనియర్'

తన చిన్నారి అభిమాని మరణాన్ని నందమూరి బాలకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. వెండితెరపై తాను చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులను ఒక చిన్న పిల్లోడు బుల్లితెరపై అవలీలగా చెప్పేస్తుంటే చూసి బాలయ్య మురిసిపోయారు. ఒకానొక సందర్భంలో ఆ బుల్లి అభిమానిని కలిశారు కూడా. ఎంతో భవిష్యత్తు ఉన్న తన అభిమాని అకస్మాత్తుగా ఈ లోకం విడిచి వెళ్లిపోవడం బాలకృష్ణను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో బాలయ్య స్పూఫ్‌లు చేస్తూ జూనియర్ బాలకృష్ణగా గుర్తింపు తెచ్చుకున్న కందుకూరి గోకుల్ సాయికృష్ణ మరణించాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గోకుల్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గోకుల్ మరణవార్త అతని కుటుంబ సభ్యులతో పాటు బాలకృష్ణ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలనటుడు ఇలా అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

కాగా, తన అభిమాని మరణవార్త విన్న బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ మేరకు ఫేస్‌బుల్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.