Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సందర్భం ఉన్నా లేకపోయినా భారత్ తో కయ్యానికి కాలుదువ్వే చైనాకు ఇప్పుడు డ్రోన్ ఘటన కలిసి వచ్చింది. సాంకేతిక కారణాల వల్ల గ్రౌండ్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు కోల్పోయి భారత డ్రోన్ చైనా భూభాగంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ముందస్తు సమాచారాన్ని ఇచ్చినప్పటికీ చైనా… ఈ అంశాన్ని సాకుగా తీసుకుని మరోసారి భారత్ పై విమర్శలకు దిగింది. భారత్ పై వ్యతిరేక వార్తలు రాసేందుకు సదా సిద్ధంగా ఉండే చైనా మీడియా గ్లోబల్ టైమ్స్… డ్రోన్ పైనా ఓ కథనాన్ని వండి వార్చింది. డ్రోన్ చైనా భూభాగంలోకి చొరబడినందుకు భారత్ క్షమాపణలు చెప్పాలన్న టైటిల్ తో కథనం ప్రచురించింది. భారత్ కావాలనే డోక్లాం ప్రతిష్టంభన జరిగిన ప్రదేశంలో డ్రోన్ ను ఉపయోగించిందని ఆరోపించింది.
కొద్ది నెలల క్రితం భారత్ – చైనా మధ్య వివాదం తలెత్తిన డోక్లాం ప్రాంతంలోకి డ్రోన్ వచ్చిందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఆ ప్రాంతం చాలా సున్నితమైనదని, ఇరుదేశాలు అక్కడ ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని ముందుగానే ఒప్పందం చేసుకున్నాయని, కానీ భారత్ మాత్రం అలా ప్రవర్తించలేదని ఆ పత్రిక ఆరోపించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించింనందుకు గానూ భారత్ క్షమాపణలు చెప్పాలని కోరింది. సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్ చైనా భూభాగంలోకి ప్రవేశించిందన్న భారత వ్యాఖ్యలపైనా ఆ దేశం వితండవాదన చేస్తోంది. గతంలో ఎక్కడైతే వివాదం నెలకొందో కచ్చితంగా అక్కడకు వచ్చినప్పుడే డ్రోన్ కు సాంకేతిక సమస్య ఎందుకు వచ్చిందని చైనా ప్రశ్నించింది. చైనా డ్రోన్ అదేవిధంగా తమ భూభాగంలోకి వస్తే భారత్ ఊరుకుంటుందా అని, సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్ వచ్చిందంటే భారత్ దాన్ని అంగీకరిస్తుందా అంటూ అడ్డగోలు వాదన చేస్తోంది. భారత డ్రోన్ సిక్కిం సెక్టార్ వద్ద వాస్తవాధీన రేఖను దాటింది. దీని గురించి చైనా దళాలకు ముందుగానే సమాచారమిచ్చామని భారత్ చెబుతోంటే చైనా మాత్రం భారత్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తోంది.