Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ జపాన్ మధ్య సంబంధాలు బలోపేతం కావడం చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ జపాన్ మైత్రీ బంధంపై చైనా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటనే లక్ష్యంగా చేసుకుని రెండు దేశాలపై చైనా విమర్శలు గుప్పిస్తోంది. ఆసియా ఖండంలో తాము అగ్రశక్తిగా ఉన్నామని..ఇప్పుడు కొత్తగా భారత్ జపాన్ కలిసి ఏం సాధిస్తాయని మొన్న ప్రశ్నించిన చైనా రెండు రోజులైనా గడవకముందే మరోసారి అక్కసు ప్రదర్శించింది. తన పర్యటనలో షింజో అబే భారత్ లోని ఈశాన్య ప్రాంతాల్లో అభివృద్ధికి జపాన్ పెట్టుబడులు పెడుతుందని ప్రకటించారు. దీనిపై చైనా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.
చైనాతో సరిహద్దు ఉన్న ఈశాన్యప్రాంతాల్లో జపాన్ పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆ దేశ విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యంగ్ తెలిపారు. భారత ఈశాన్య రాష్ట్రాలను కలిపే రహదారి, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జపాన్ సహకారాన్ని ఎంతమాత్రం అంగీకరించబోమని స్పష్టంచేశారు. భారత్ -చైనా సరిహద్దుల్లో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని అన్నారు. భారత్, చైనా సరిహద్దులు ఇంకా తేలలేదని, ఇరుదేశాల మధ్య దీనిపై వివాదాలు కొనసాగుతున్నాయని, ఏకాభిప్రాయంతోనే సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హువా చున్యంగ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చైనా చేసిన ఈ ప్రకటన చూస్తే…భారత్, జపాన్ కలిసి తనకు ఎక్కడ చెక్ పెడతాయో అని ఆ దేశం ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. అయినా..ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిలో జపాన్ సాయం తీసుకోవడమన్నది భారత్ అంతర్గత విషయమని…దీనిపై చైనా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చైనాకు భారత్ గట్టి హెచ్చరిక చేయాలని కూడా వారు సూచిస్తున్నారు.