Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లామ్ సరిహద్దు సమస్యకు తెరపడినప్పటికీ చైనా తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. వివాదం ముగిసిన తర్వాతిరరోజే మళ్లీ హెచ్చరికల పర్వం మొదలుపెట్టింది. డోక్లామ్ వివాదం నుంచి భారత్ మరోసారి పాఠాలు నేర్చుకోవాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గట్టి హెచ్చరిక చేసింది. భారత్-చైనా మధ్య వివాదం ముగిసిపోయినప్పటికీ తమ దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతను పరిరక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉంటామని తెలిపింది.
భారత్ అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన నియమాలు, ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సలహా ఇచ్చింది. సరిహద్దు వెంట శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు భారత్ తమ సైన్యంతో కలిసి పనిచేయాలని కోరింది. ఇరు దేశాల సైన్యాలు కలిసి పనిచేస్తే ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించినట్లవుతందని చైనా పీఎల్ ఏకి చెందిన సీనియర్ కల్నల్ వు క్విన్ అభిప్రాయపడ్డారు. చైనా భారత్ కు ఇలా హెచ్చరికలు చేయటం ఇదే ప్రథమం కాదు. సరిహద్దు వివాదం సాగుతున్న సమయంలోనూ భారత్ 1962 నాటి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని వ్యాఖ్యానించి ఆగ్రహం తెప్పించింది. ఈ హెచ్చరికలకు తమది 1962 నాటి దేశం కాదని, పరిస్థితులు మారాయని భారత్ గట్టిగా బదులిచ్చింది. ఈ హెచ్చరికలు, మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారం రెండున్నర నెలలు సాగిన తరువాత ఎట్టకేలకు డోక్లామ్ వివాదానికి పరిష్కారం లభించింది.
సరిహద్దు వద్ద మోహరించిన సైన్యాన్ని ఇరదేశాలు ఒకేసారి వెనక్కిపిలిచేందుకు దౌత్యపరమైన చర్చల్లో అంగీకారం కుదరటంతో యుద్ధం దాకా వచ్చిన ఉద్రిక్తతలు చల్లారినట్టయింది. ఈ వివాదం తరువాత అయినా చైనా వైఖరిలో మార్పు వస్తుందని అంతా భావించారు. అనవసర కయ్యాలు పెట్టుకోకుండా భారత్ తో ఆ దేశం శాంతియుతంగా, స్నేహపూర్వకంగా ఉంటుందని భావించారు. కానీ ఆ అంచనాలను వమ్ము చేస్తూ చైనా ఎప్పటిలానే తన నైజాన్ని ప్రదర్శిస్తోంది.