Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లామ్ వివాదం నేపథ్యంలో మొండిపట్టు వీడని చైనా ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపే ప్రయత్నం చేస్తోంది. బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదుల జల ప్రవాహానికి సంబంధించిన వివరాలను ఏటా భారత్ తో పంచుకోవాలని రెండు దేశాల మధ్య 2006లో ఒక ఒప్పందం కుదిరింది. ఏటా మే 15 నుంచి అక్టోబరు 15 మధ్య ఈ సమాచారాన్ని చైనా భారత్ కు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే డోక్లామ్ వివాదం సాగుతున్న ప్రస్తుత తరుణంలో నదీజలాల సమాచారం ఊసే చైనా ఎత్తడం లేదని భారత్ ప్రకటించింది. బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదుల ద్వారా వచ్చే వరదల ప్రభావం అసోంపై తీవ్రంగా ఉంటుంది. దీంతో పాటు పశ్చిమ బంగ, ఉత్తరప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం కూడా వరదల ముప్పు ఎదుర్కొంటున్నాయి.
నీటి ప్రవాహ వివరాలను చైనా తెలియజేస్తే.. ముందస్తుగా భారత్ వరద నివారణ చర్యలు చేపడుతుంది. కానీ ఈ సారి చైనా ఆ వివరాలు అందజేయలేదు. ఇప్పుడే కాదు…గతంలో కూడా నదీజలాల విషయంలో చైనా వివాదాస్పదంగా ప్రవర్తించింది. పాకిస్థాన్ తో సింధూ జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భారత్ నిర్ణయించటంతో పాక్ కు మద్దతుగా చైనా..మనదేశంలోకి బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మించింది. దీంతో పాటు మరో మూడు ప్రాజెక్టులు కట్టటానికి కూడా చైనా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా చైనా…వీలుచిక్కినప్పుడల్లా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంది. మరోవైపు భారత్, చైనా మధ్య రాళ్లదాడి జిరిగిన లడఖ్ లో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పర్యటించనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో తూర్పు లడఖ్ లో భద్రతను, చైనా సరిహద్దుల్లో భద్రతా బలగాల సంసిద్ధతను పరిశీలించనున్నారు.
మరిన్ని వార్తలు: