Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ , జపాన్ మధ్య పెరుగుతున్న స్నేహం గమనిస్తే… శత్రువుకు శత్రువు మన మిత్రుడు అన్న సామెత గుర్తుకొస్తుంది. ఒక్క పాకిస్థాన్ తప్ప మిగిలిన సరిహద్దు దేశాలతో చైనాది ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే వైఖరే. మనదేశంతో చైనా కున్న గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిహద్దు వివాదాలు రెండు దేశాల మధ్యా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మనతో కన్నా ఎక్కువగా చైనాకు జపాన్ తో గొడవలున్నాయి. తొలినుంచీ ఆ రెండూ ప్రత్యర్థి దేశాలు. చైనాకు, జపాన్ కు ఎప్పుడూ పడదు. జపాన్ ఎంత శాంతికాముకంగా ఉన్నా చైనా తరచూ ఆ దేశంతో గొడవలకు దిగుతుంటుంది.
ఈ నేపథ్యమే భారత్, జపాన్ ను ఇటీవలికాలంలో మరింత దగ్గర చేస్తోంది. ఇదే చైనాకు ఆగ్రహం తెప్పిస్తోంది. భారత్, జపాన్ మధ్య సంబంధాలు బలోపేతం కావడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. జపాన్ ప్రధాని షింజో అబే భారత్ పర్యటన సమయంలో తన అక్కసును వెళ్లగక్కింది. భారత్, జపాన్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. డోక్లామ్ సమస్యతో పాటు… బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా చైనా అక్కసుకు కారణం. భారత్ లో బుల్లెట్ రైలు ప్రాజెక్టును దక్కించుకునేందుకు చైనా విశ్వప్రయత్నం చేసింది. కానీ చైనా వివాదాస్పద వైఖరిపై నమ్మకంలేని భారత్ ఆ ప్రాజెక్టును తెలివిగా జపాన్ కు అప్పగించింది. తన పర్యటనలో షింజో అబే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది తట్టుకోలేని చైనా రెండు దేశాలపై విమర్శలు మొదలుపెట్టింది.
ఎప్పటిలానే చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ భారత్-జపాన్ మైత్రీ బంధం గురించి ఓ కథనాన్ని ప్రచురించింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విషయంలో భారత్, జపాన్ తమ గోతిని తామే తవ్వుకుంటున్నాయని ఆ పత్రిక పేర్కొంది. ఆసియాలోని ఏ దేశం కూడా చైనాకు సరితూగవని మండిపడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియాలో పరుగుపందెంలో ఎవరు గెలిస్తే వారే విజేత అని, ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో తిరుగులేని శక్తిగా చైనా ఆవిర్భవించిందని వ్యాఖ్యానించిన గ్లోబల్ టైమ్స్… భారత్, జపాన్ కలిసి ఇప్పుడు కొత్తగా ఏం సాధిస్తాయని అపహాస్యం చేసింది. ఆసియాలో అత్యంత సంకుచితంగా ఆలోచించే దేశం జపాన్ అని, భారత్, జపాన్ లు ఎంత దగ్గరైనా చైనాకు వచ్చే నష్టం ఏమీలేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. జపాన్, భారత్ మైత్రీబంధంతో తమ దేశానికి వచ్చే నష్టం ఏమీ లేనప్పుడు చైనా ఈ స్థాయిలో అక్కసు ప్రదర్శించాల్సిన అవసరం ఏముంటుంది? అంటే జపాన్, భారత్ కలిసి ఓ కొత్త శక్తిగా ఆవిర్భవించి చైనాకు చెక్ పెడతాయన్నది ఆ దేశం ఆందోళన అని అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు.