జపాన్ ప్రధాని షింజో అబే భారత్ లో పర్యటించిన దగ్గర నుంచి చైనాకు కంటిమీద కునుకు ఉండడం లేదు. షింజో అబే భారత పర్యటన ముగించుకుని స్వదేశం వెళ్లిపోయి ఆంతరంగిక వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు. ఇటు భారత్ కూడా తన పని తాను చేసుకుపోతోంది. కానీ చైనా మాత్రం షింబో అబే భారత్ లో పర్యటించడాన్ని, బుల్లెట్ ట్రైన్ కు శంకుస్థాపన చేయడాన్ని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సాయమందిస్తామని హామీ ఇవ్వడాన్ని.. మర్చిపోలేకపోతోంది. తమకు ఆగర్భశత్రువైన జపాన్ తో భారత్ కలిసిపోతే ఏం జరుగుతుందో అని తెగ మధన పడిపోతోంది. కొన్ని రోజుల నుంచీ చైనా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ.
ఆసియా ఖండంలో సాధించాల్సిన ఘనతలన్నీ ఇప్పటికే చైనా సాధించేసిందని.. ఇప్పుడు కొత్తగా భారత్, జపాన్ కలిసి ఏం చేస్తాయని తొలుత ప్రశ్నించింది చైనా… తర్వాతిరోజు తమ దేశంతో సరిహద్దు గొడవలున్న భారత ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది. అయితే చైనా అభ్యంతరాలను భారత్ పట్టించుకోవటం లేదు. అసలు చైనా వ్యాఖ్యలపై కనీసం స్పందించటం లేదుకూడా. దీంతో ఇప్పుడు చైనా కొత్త రాగం మొదలుపెట్టింది. డోక్లామ్ సరిహద్దు సమస్య సమయంలో భారత్ కు వ్యతిరేకంగా తీవ్ర కథనాలు రాసిన చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కు ఇప్పుడు భారత్ పై ఎక్కడాలేని ప్రేమ పుట్టుకొచ్చింది. భారత్… చైనా శత్రుదేశమైన జపాన్ ను నమ్మొద్దంటూ హితబోధ ప్రారంభించింది. చైనా వెస్ట్ నార్మల్ యూనివర్శిటీకి చెందిన సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్ విభాగ డైరెక్టర్ జింగ్ చున్ … భారత శ్రేయస్సు కోసమంటూ… రాసిన ఓ కథనాన్ని గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది.
అమెరికాతో కలిసి జపాన్ భారత్ ను తప్పుదోవ పట్టిస్తోందని జింగ్ చున్ తన కథనంలో పేర్కొన్నారు. అమెరికా, జపాన్ మాటలు నమ్మి భారత్… ది బెల్ట్ అండ్ రోడ్ ఫోరం సదస్సును బహిష్కరించిందని, భారత్ ను వద్దన్న ఆ రెండు దేశాలు తమ ప్రతినిధులను మాత్రం సదస్సుకు పంపించాయని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. జపాన్ అమెరికాను నేరుగా ఎదుర్కోలేక భారత్ ను పావుగా వాడుకుంటోందని ఆరోపించింది. మోడీ, అబేలు ప్రస్తావించిన ఆసియా- ఆఫ్రికా గ్రోత్ కారిడార్ కాన్సెప్ట్ చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తీసుకున్నదే అని ఆరోపించింది. ఓ పక్క హితబోధ చేస్తూనే..మరో పక్క భారత్ లో ఎన్ని ఎక్స్ ప్రెస్ వేలను, బుల్లెట్ ట్రైన్లను నిర్మించినా..అక్కడి రహదారులు మురికి కూపాలను పోలి ఉంటాయంటూ… ఎద్దేవా చేయటం ద్వారా…. గ్లోబల్ టైమ్స్…చైనా బుద్ధి మారదని నిరూపించింది.