Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరకొరియా, అమెరికా మద్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చైనా దూత సాంగ్ టావో ఉత్తరకొరియాలో పర్యటించారు. ఉత్తరకొరియా వరుస అణుపరీక్షల గురించి సాంగ్ చర్చించారని భావిస్తున్నారు. సాంగ్ తమ దేశానికి వచ్చారని, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ అధికారి చోయ్ ర్యాంగ్ హేతో చర్చలు జరిపారని ఉత్తరకొరియా అధికారిక వార్తా ఏజెన్సీ తెలిపింది. ఉత్తరకొరియాకు అతిపెద్ద వాణిజ్యభాగస్వామి చైనాయే.
ఉత్తరకొరియాకు చెందిన 90శాతం వ్యాపారం చైనాతోనే జరుగుతుంది. కిమ్ పై చైనా రాజకీయంగా ఒత్తిడి తేలేకపోయినా…వాణిజ్య పరంగా అది సాధ్యం కావొచ్చని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. అమెరికా ప్రోద్బలంతో ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాపై విధించిన ఆంక్షల్లో భాగంగా ఆ దేశంతో ఎగుమతులు, దిగుమతులను చైనా తగ్గించుకుంది. గతవారం ఆసియా పర్యటనలో భాగంగా చైనాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఉత్తరకొరియాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని చైనాకు సూచించారు.
ఈ నేపథ్యంలో చైనా దూత ఉత్తరకొరియాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద చర్యగా అభివర్ణించారు. అటు సాంగ్ పర్యటనపై చైనా కూడా ప్రకటన చేసింది. చైనాలో ఇటీవల జరిగిన కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశం విశేషాలు, రెండు దేశాలకు ప్రయోజనకర అంశాలు వెల్లడించేందుకు అధ్యక్షుడు షి జిన్ పింగ్ బదులుగా సాంగ్ టావో ఉత్తరకొరియాలో పర్యటించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.