సినీపరిశ్రమలో లైంగిక వేధింపులను బయటపెట్టినందుకే తనకు అవకాశాలు రాకుండా చేశారని నేపథ్య గాయని, చిన్మయి శ్రీపాద ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల మీద గొంతెత్తి మాట్లాడినందుకు తనకు అవమానాలు, హేళనలు ఎదురయ్యారని పైపెచ్చు తనను డబ్బింగ్ యూనియన్ నుంచి బహిష్కరించారనీ, అదే సమయంలో గేయ రచయిత వైరముత్తు మాత్రం గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ సత్కరాలు, సన్మానాలు పొందుతున్నారని ఆమె మండిపడ్డారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సమాజంలో బాధితురాలికి న్యాయం జరగడం అంత సులభం కాదని బాధితురాలు చనిపోతే, హత్యకు గురయితేనే సమాజం సీరియస్ గా పట్టించుకుంటుందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను సోషల్ మీడియా నుంచి అన్నిరకాల వేధింపులను ఎదుర్కొంటున్నానని వాపోయారు. తనను దూర్భాషలాడుతూ ట్రోలింగ్ చేస్తున్నారనీ, ‘నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు’ అని పిచ్చిపిచ్చి సందేశాలతో వేధిస్తున్నారని ఆమె వాపోయారు. కొందరు తాను ఫేమస్ అవ్వడానికే ఇలా ఆరోపణలు చేస్తున్నానని అంటున్నారని తాను ఇప్పటివరకూ 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఐదు రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నానని చిన్మయి తెలిపారు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో గాయనిగా పేరు తెచ్చుకున్నాననీ, తాను సంచలనాల కోసం ఎందుకు ఆరోపణలు చేస్తానని ప్రశ్నించారు. అమ్మాయిలపైనే కాదు, చిన్నవయసు అబ్బాయిలపైనా అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.