Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చరిత్ర తిరగేస్తే అధికారం కోసం కొట్టుకున్న దాయాదులు, ఒకరినొకరు చంపుకున్న అన్నదమ్ములు, తండ్రిని బంధించిన కొడుకులు, వరస కాని పెళ్లిళ్లు చేసుకున్న రక్త సంబంధీకులు, వెన్నుపోట్లు… ఇలా విలువ తక్కువ పనులు ఎన్నో కనిపిస్తాయి. ఆధునిక రాజకీయం కూడా అందుకు ఏ మాత్రం భిన్నం కాదు. ఎన్టీఆర్ ని పదవి నుంచి దింపడంలో కీలక పాత్ర కుటుంబ సభ్యులదే. ఇక కరుణానిధి కొడుకులు స్టాలిన్, అళగిరి తండ్రి బతికి ఉండగానే పార్టీ మీద పట్టు కోసం ఎలా కొట్టుకున్నారో చూసాం. ఇక ములాయం, అఖిలేష్ తండ్రీకొడుకులు అయినా అధికారం కోసం ఏ స్థాయిలో యుద్ధం చేశారో చూసాం. జనం అమ్మ అని పిలిచిన జయ మరణించిన ఏడాది తర్వాత ఆమె గతాన్ని తవ్వి ఆమె పేరు ప్రతిష్టలను పూడ్చి పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చూస్తున్నాం. ఇక రాజకీయంగా తనకు బిక్ష పెట్టిన అద్వానీని ప్రధాని మోడీ ఎక్కడ ఉంచారో చూస్తున్నాం. ఇదీ రాజకీయం విశ్వరూపం. తిమ్మిని బొమ్మిని చేసే ఈ రాజకీయ క్రీడలో జనసేన అధినేత పవన్ కొత్త అంకం రాయబోతున్నట్టు పుకార్లు గుప్పుమంటున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఉరుకులు పరుగులు తీస్తున్న ఐటెం జనసేనలో అన్న చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్ పెద్ద పీట వేయబోతున్నారు అని. ఈ ఊహాగానాల మీద పవన్ లేదా చిరు ఇంకా మాట్లాడలేదు. నిజానికి ప్రజారాజ్యం వైఫల్యం తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ చిరు తీసుకున్న రాజకీయ నిర్ణయం పవన్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ గ్యాప్ అన్నదమ్ముల మధ్య రాజకీయంగా ఇంకా అలాగే వుంది అనుకోడానికి వీల్లేదు. కాంగ్రెస్ ద్వారా చిరుకి లభించిన రాజ్యసభ సభ్యత్వం గడువు అయిపోవచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజారాజ్యం వైఫల్యాల గురించి మాట్లాడుతూ అన్న చిరంజీవిని దెబ్బ తీసిన వారు ఎవరినీ వదిలిపెట్టబోనని చెప్పడంతో అన్నదమ్ముల మధ్య బంధం బలం ఏమిటో తెలిసొచ్చింది. ఈ కామెంట్ ఆధారంగానే సోషల్ మీడియాలో చిరు కి జనసేనలో స్థానం అన్న పుకారు పుట్టించి ఉండొచ్చు. కానీ రామాయణంలో నాడు రాముడు అడవికి వెళ్లాడని ఆయన చెప్పులు సింహసనంలో పెట్టి పాలన సాగించిన భరతుడు గురించి అందరూ విని ఉంటాం. కానీ ఇప్పుడు పవన్ అలాగే అన్న చిరంజీవి కోసం జనసేన సృష్టించి ఆయనకు పెద్ద పీట వేస్తున్నాడు అంటే నమ్మలేని పరిస్థితి. కానీ పవన్ కాస్త డిఫరెంట్. అందుకే ఈ పుకారుని నిజం చేస్తూ ఆయన భరతుడు అవతారం ఎత్తినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ నాటి రాముడిలా అడవినుంచి వచ్చి పట్టాభిషిక్తుడు కావడానికి రాజకీయ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చే చిరంజీవి సిద్ధంగా ఉంటాడా అన్నది సందేహమే.