చిరంజీవి షూటింగ్ లో కార్ వాన్ల హ‌డావుడి

చిరంజీవి షూటింగ్ లో కార్ వాన్ల హ‌డావుడి

ఓ పెద్ద హీరో సినిమా అంటే.. ఆ షూటింగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో కార్ వాన్ల హ‌డావుడి ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. చిరంజీవి – కొర‌టాల శివ సినిమా షూటింగ్‌లోనూ ఇదే తంతు. కాక‌పోతే… అక్క‌డ మామూలు స్థాయిలో క‌న్నా, రెండింత‌లు, మూడింత‌ల‌లో కార్‌వాన్లు క‌నిపిస్తున్నాయి. ఈ కార్ వాన్లు స‌ప్ల‌య్ చేయ‌లేక‌… ప్రొడ‌క్ష‌న్ సిబ్బంది గోల చేస్తున్నార‌ని స‌మాచారం. చిరు 152వ సినిమా ఇటీవ‌ల హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఓ పాట‌తో షూటింగ్ మొద‌లెట్టారు.

నైట్ ఎఫెక్ట్‌లో సాగే పాట ఇది. చిరంజీవి, కొర‌టాల శివ‌ల‌కు కార్‌వాన్లు త‌ప్ప‌నిస‌రి. డాన్స్ మాస్ట‌ర్‌కి ఓ కార్ వాన్ ఇచ్చారు. కెమెరామెన్ ర‌త్న‌వేలుకి ఓ కార్‌వాన్, ఆయ‌న టీమ్‌లో ప్ర‌ధాన సిబ్బందికి మ‌రో కార్ వాన్ ఇవ్వాల్సివ‌చ్చింద‌ట‌. మ‌ధ్య‌మ‌ధ్య‌లో రామ్‌చ‌ర‌ణ్ కూడా సెట్‌కి వ‌చ్చి, వ్య‌వ‌హారాల్నిచూసుకుని వెళ్తున్నాడు. ఆయ‌న వెంటే ప్ర‌త్యేక‌మైన కార్ వాన్ వ‌స్తోంది. చిరంజీవి కాస్ట్యూమ్స్ అన్ని కుమార్తె సుస్మిత‌నే చూసుకుంటుంది. ఆమె కూడా కార్ వాన్ డిమాండ్ చేయ‌డంతో – ఆ షూటింగ్ సెట్ చుట్టూ, కార్ వాన్లే క‌నిపిస్తున్నాయ‌ని స‌మాచారం. చిరంజీవి ఎప్పుడూ బ‌డ్జెట్‌ని అదుపులో పెట్టాలి, త‌క్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయాల‌ని చెబుతుంటారు. కానీ… వాస్త‌వ ప‌రిస్థితుల్లోకి వ‌చ్చేస‌రికి.. ఆ నిబంధ‌న‌ల‌న్నీ ఇలా గాలికి కొట్టుకెళ్లిపోతుంటాయి.