తన తండ్రి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో చరణ్ నిర్మాతగా మారాడు. ఆ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని, పెట్టిన పెట్టుబడికి రెండు రెట్ల లాభాలను దక్కించుకున్నాడు. దాదాపు 100 కోట్ల లాభాలను చరణ్ ఆ చిత్రంతో రాబట్టాడు. ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రాన్ని చరణ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంను చరణ్ నిర్మిస్తున్నాడు. నిర్మాతగా చరణ్‌కు ఇది రెండవ సినిమానే అయినా కూడా భారీగా బిజినెస్ అయ్యేలా ముందు నుండే ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ ఉంటే హిందీలో డబ్బింగ్ రైట్స్‌కు భారీ మొత్తం వచ్చే అవకాశం ఉందని అమితాబచ్చన్‌ను ఎంపిక చేయడం జరిగింది.
తమిళంలో భారీ బిజినెస్‌కు విజయ్ సేతుపతిని ఎంపిక చేయడం జరిగింది. ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రం అవ్వడంతో ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో చరణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. పలు ఇండియన్ చిత్రాలు చైనాలో భారీ వసూళ్లను సాధించాయి. అందుకే ఈ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చరణ్ భావిస్తున్నాడు. చైనాలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఒక షెడ్యూల్ చిత్రీకరణను అక్కడ ప్లాన్ చేశాడు. త్వరలోనే సైరా చిత్రీకరణ కోసం యూనిట్ సభ్యులు చైనా వెళ్లబోతున్నారు. దాదాపు 20 రోజుల పాటు అక్కడ చిత్రీకరణ జరుపబోతున్నారు. చైనాలో చిత్రీకరణ జరిపితే విడుదలకు మార్గం సుగమం అవుతుందనే ఉద్దేశ్యంతో చరణ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంతో 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలనేది చరణ్ అండ్ కో ప్రయత్నం. మరి అది సాధ్యం అయ్యేనో చూడాలి.