కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, ఫైనాన్షియర్ మోహన్ అలియాస్ కపాలి మోహన్(58) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గంగమ్మగుడి పీఎస్ పరిధిలోని బసవేశ్వర కె.ఎస్.ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో ఫ్యాన్‌కు ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కన్నడ పరిశ్రమతో సత్సంబంధాలు కలిగిన ఆయన బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్థిక సమస్యలే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఆదివారం రాత్రి స్నేహితుడితో కలిసి భోజనం చేసిన ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత కొడుకుతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు. ‘అందరికీ నమస్కారం. నేను బసవేశ్వర కె.ఎస్.ఆర్టీసీ బస్టాండు వద్ద సింగల్ బిడ్ టెండర్ తీసుకుని అందులో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టాను. అందులో దానివల్ల నాకు ఎంతో నష్ట్ వచ్చింది. ఏడేళ్ల నుంచి అనేకసార్లు విన్నవించుకుంటున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాను. అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు అధికారులు నా ఆస్తుల్ని జప్తు చేశారు. ఇళ్లు, ఇతర ఆస్తుల్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని విధాలుగా ఓడిపోయాను. దయచేసి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రయత్నిస్తారని నమ్మకం ఉంది’ అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.