Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాలు లేని ప్రపంచాన్ని ఊహించగలమా…? అసలు సినిమాలు చూడకుండా జీవించగలమా..? మనిషి జీవితంలో వినోదానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతరోజుల్లో ఆ వినోదాన్ని అందించే ముఖ్యసాధనం సినిమానే. సినిమాకు సంబంధించిన వృత్తుల్లో స్థిరపడ్డవారే కాక..అనేకమంది అభిమానులు సినిమానే శ్వాసగా భావిస్తుంటారు. మన రాష్ట్రం, దేశం అనేకాదు..ప్రపంచంలోని చాలా దేశాలదీ ఇదే పరిస్థితి. వీకెండ్ రాగానో… స్పెషల్ అకేషన్ లోనో సినిమా లేకుండా మన సంతోషాన్ని ఊహించలేం. కానీ అదే సమయంలో సినిమాలను నిషిద్ధంగా భావించి అసలు థియేటర్ అన్నపదమే తమ దగ్గర లేకుండా చేసిన దేశాలు కూడా ఇప్పటి రోజుల్లో ఉన్నాయంటే నమ్మగలమా..?
సౌదీ అరేబియాను చూస్తే నమ్మక తప్పదు. చమురు నిల్వలతో సమృద్ధి దేశంగా ఉండే సౌదీ లో నిన్నటిదాకా సినిమా థియేటర్ అన్నది కనిపించలేదు. దీనికి కారణం 1980ల్లో సౌదీలో పెద్ద ఎత్తున జరిగిన ఇస్లామిక్ పునరుద్ధరణ ఉద్యమం. ఈ ఉద్యమం సౌదీ ప్రజల జీవనవిధానాన్ని మార్చివేసింది. సినిమాలు మతవిరుద్ధమంటూ అక్కడ అన్ని థియేటర్లను మూసివేశారు. ప్రస్తుతం ఆ దేశంలో ఒకే ఒక్క సినిమా హాల్ ఉంది. అది ఖోబార్ లోని ఐమాక్స్ థియేటర్. అయితే అందులోనూ అన్ని సినిమాలూ ప్రదర్శించరు.
కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్యుమెంటరీలకోసమే దాన్ని ఏర్పాటుచేశారు. ఇన్నేళ్లగా అక్కడి ప్రజలు సినిమాల్లేకుండానే జీవనం వెళ్లదీస్తున్నారు. అయితే కాలక్రమేణా అక్కడి పాలకుల ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. దీంతో మళ్లీ థియేటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో తొలి సినిమా థియేటర్ ప్రారంభించే అవకాశం ఉందని సౌదీమంత్రి ఒకరు చెప్పారు. 35 ఏళ్ల తర్వాత అక్కడ ప్రారంభమవుతున్న థియేటర్లలో విడుదలయ్యే తొలి సినిమా మనదే. సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 అక్కడ విడుదల కానుంది. తన సినిమాలను జపాన్ లో విడుదల చేసి అక్కడ లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న తలైవాకు 2.0 తర్వాత ఇక సౌదీలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు.