Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాలు సమాజానికి మంచి చేస్తాయా… చెడు చేస్తాయా అన్నది ఎప్పుడూ చర్చనీయ అంశమే. దర్శకులవారీగా కూడా ఈ చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కమర్షియల్ దర్శకులెవరూ సమాజానికి మంచి సందేశం ఇవ్వరన్నది సహజంగా వినిపించే అభిప్రాయం. సినిమాల గురించి విమర్శలు చేయాల్సి వస్తే… ముందుగా అందరూ కమర్షియల్ సినిమాల దర్శకులనే విమర్శిస్తుంటారు. సినిమాలతో సమాజంపై చెడు ప్రభావం చూపిస్తున్నారని, ముఖ్యంగా యువతను చెడగొడుతున్నారన్నది… దర్శకులపై చెప్పే ప్రధాన ఫిర్యాదు. ఈ వరుసలో అందరికన్నా ఎక్కువ విమర్శలకు గురయ్యే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తొలి సినిమా శివ నుంచి… ఇటీవలి చిత్రాలన్నింటినీ ఉదాహరణగా చూపిస్తూ వర్మను ఆడిపోసుకుంటుంటారు విమర్శకులు. తన సినిమాలతో సమాజంలో నేరప్రవృత్తిని వర్మ పెంచిపోషిస్తున్నారని, నేరస్థులకు, ఆకతాయిలు ఆయన సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతున్నారనేది వర్మపై ప్రధానంగా వినిపించే విమర్శ. ఈ నేపథ్యంలో వర్మకు సంతోషం కలిగించే సంగతి ఒకటి జరిగింది.
సివిల్స్ లో 624వ ర్యాంకు సాధించిన వరంగల్ కు చెందిన అక్షయ్ అనే వ్యక్తి ఓ ఇంటర్వ్యూలో తనకు స్ఫూర్తి వర్మేనని చెప్పారు. వర్మ స్ఫూర్తితోనే తాను సివిల్స్ సాధించానని, తన జీవితంలో కీలక పాత్ర పోషించింది వర్మేనని అన్నారు. తాను రామ్ గోపాల్ వర్మకు వీరాభిమానినని, వర్మకు సంబంధించి ఏ ఒక్క వీడియోను మిస్సవ్వనని, చెప్పాలంటే సివిల్స్ పరీక్షకు ఒక రోజు ముందు కూడా వర్మకు సంబంధించిన ఓ వీడియోను చూశానని అక్షయ్ తెలిపారు. త్వరలోనే ఆయన్ను కలవాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఉన్నతస్థానంలో ఉన్నప్పుడే ఆయన్ను కలవాలనుకున్నానని, ఎందుకంటే ఆయనకంటే తక్కువ స్థానంలో ఉంటే తనను పట్టించుకోరనే భయమని, అదే జరిగితే తాను భరించలేనని అక్షయ్ చెప్పుకొచ్చారు. లాజికల్ గా ఎలా మాట్లాడాలన్నది తాను వర్మ నుంచే నేర్చుకున్నానన్నారు. ప్రపంచంలోని అందరు తత్త్వ వేత్తల గురించి వర్మ చదివారని, కాబట్టి తాను వారి గురించి చదవడం కంటే వర్మను చదవడం నయం అనిపించిందని, దీనివల్ల తన పనులు సులభంగా చేసుకోగలుగుతున్నానని అక్షయ్ చెప్పారు.
వర్మ తెరకెక్కించిన సత్య సినిమా చాలాసార్లు చూశానన్నారు. నేరాలకు సంబంధించిన సినిమాలు తీయడంలో వర్మది విభిన్నశైలని కొనియాడారు. తన గ్యాంగ్ లో ఉన్న ఐదుగురు స్నేహితులను కూడా వర్మ అభిమానులుగా మార్చివేశానని అక్షయ్ వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ వీక్షించిన వర్మ ఆనందానికి హద్దుల్లేవు. దీనిపై ట్విట్టర్ లో వర్మ తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో రెండుసార్లు సివిల్స్ లో విఫలమయ్యానని, అలాంటి తాను ఓ టాపర్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు గర్వంగా ఉందని వర్మ సంతోషం వ్యక్తంచేశారు. నేరస్థులకు, ఆకతాయిలకు మాత్రమే తాను స్ఫూర్తిదాయకం అని అనుకునేవారికి ఇది గుణపాఠం అవుతుందన్నారు. అక్షయ్ ను త్వరలో కలిసి చదువుగురించి చర్చించాలనుకుంటున్నాను… అని వర్మ ట్వీట్ చేశారు.