ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన నేటికి ఆమరణ దీక్ష 11వ రోజుకు చేరుకుంది. బీపీ, షుగర్ లెవల్స్ అధిక స్థాయిలో పడిపోతుండటంతో రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. గత పది రోజులుగా ఎటువంటి ఆహారాన్ని ఆయన తీసుకోకపోవడంతో పలు అవయవాల పనితీరు మందగించిందని, షుగర్ లెవల్స్ పడిపోయాయని, రక్తపోటు కనీస స్థాయికి చేరిందని, వెంటనే ఆసుపత్రికి తరలించకుంటే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తాజా నివేదికను ఉన్నతాధికారులకు అందించారు.
అయితే అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబునాయుడు, ఈ ఉదయం తన కుమారుడు లోకేష్ తో కలసి కడపకు బయలుదేరారు. ఉక్కు పరిశ్రమపై కీలక ప్రకటన చేయనున్నారు. సీఎం రమేష్‌తో దీక్ష విరమింప చేసే అవకాశం ఉంది. కాగా, నేడు రమేష్ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తనను బలవంతంగా ఆసుపత్రికి తరలించినా, దీక్షను కొనసాగిస్తానని సీఎం రమేష్ స్పష్టం చేస్తున్నారు. అలాగే రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీటెక్ రవిని సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు.