హైదరాబాద్, లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ప్రత్యేక కాన్వాయ్ ను ఏర్పాటు చేశారు. ఈ కాన్వాయ్ లో జగన్ ప్రధాని మోదీ నివాసానికి వెళ్లనున్నారు. జగన్ కాన్వాయ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో పాటు మిధున్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మరికొందరు నేతలు నిన్ననే ఢిల్లీకి చేరుకుని జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 10.40కి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న జగన్ ఈ సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరనున్నారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సహా పలు కీలకమైన అంశాలపై మోదీతో జగన్ చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోదీతో భేటీ అనంతరం జగన్ ఏపీ భవన్ కు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లి, అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు.