తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండడంతో సీఎం కేసీఆర్ ముందుగానే లాక్డౌన్ ప్రకటించేశారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులలో కరోనా బారిన పడకుండా ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఖచ్చితంగా లాక్డౌన్ పాటించాల్సిందేనని విజ్ఞప్తి చేశారు.అయితే నేతలంతా ఇళ్ళలో కూర్చుని ఉండడం సరికాదని, ఇలాంటి సమయంలో పని చేస్తారనే ఉద్దేశ్యంతోనే ప్రజలు నాయకులను ఎన్నుకుంటారని సీరియస్ అయ్యారు.
అయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ క్లాస్ పీకడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అంతా ఇప్పుడు ఎక్కువగా రోడ్ల మీదే కనిపిస్తున్నారు. రోడ్లపైకి వస్తున్న ప్రజలకు లాక్ డౌన్ గురించి అవగాహన కల్పించడం కాకుండా, వారికి తలెత్తుతున్న ఇబ్బందులు, సమస్యలను దగ్గరుండీ మరీ పరిష్కరిస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ క్లాస్ తీసుకోవడంతో నేతలలో తమ బాధ్యతను గుర్తుచేసిందనే చెప్పాలి.