Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల గురించిన ఏ చిన్న విషయమైనా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా రాజకీయ నేతల విషయాలయితే… అదే పనిగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు. నాయకులు, నాయకురాళ్ల ప్రసంగాల్లో తప్పులు… స్టేజీ మీద వారి పొరపాట్లుకు సంబంధించిన వీడియోలను హల్ చల్ చేస్తూ తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అలా పశ్చిమ బంగ ముఖ్యమంత్రి, అభిమానులంతా ముద్దుగా దీదీ అని పిలుచుకునే మమతా బెనర్జీకి చెందిన ఓ సరదా వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
కోల్ కతాలో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో దీదీ పాల్గొన్నారు. అనంతరం ఆమె స్టేజీ దిగి వెళ్లిపోడానికి సిద్ధమయ్యారు. దీంతో అందరూ ఆమెకు దారి ఇస్తూ పక్కకు తొలగుతున్నారు. వెళ్తూ వెళ్తూ మీడియా కవరేజీ వైపు చూసిన మమత దిగిపోతూ ఓ రెండు మాటలు మాట్లాడాలని భావించారు. ఆ క్రమంలో మైక్ అనుకుని పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు చేతిలోని టార్చిలైట్ తీసుకున్నారు. అది వెలిగే ఉండడంతో ఆమె నోటిదగ్గర పెట్టుకోగానే వెలుతురు ముఖంపై పడింది. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ టార్చి తీసేసుకుని మమతకు మైక్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. మమతకు టార్చ్ లైట్ ను మైక్ గా మార్చే పవర్ ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.