Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై ప్రధానమంత్రి మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నోయిడాకు కొత్త మెట్రో రైలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ యోగిని పొగిడారు. ఆయన పొగడ్తలకు కారణం గత యూపీ ముఖ్యమంత్రులు నమ్మిన ఓ మూఢనమ్మకాన్ని యోగీ పట్టించుకోకపోవడమే.
నోయిడాకు శాపగ్రస్త నగరం అని పేరు. ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఆ నగరంలో అడుగుపెడితే తర్వాత ఎన్నికల్లో గెలుపొందరన్నది అక్కడ ప్రచారంలో ఉంది. దీంతో కొన్నేళ్లుగా ముఖ్యమంత్రులుగా ఉన్నవారు అక్కడ అడుగుపెట్టే సాహసం చేయడం లేదు. కానీ యోగీ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించారు. ఎలాంటి పునరాలోచన లేకుండా ధైర్యంగా నోయిడా వెళ్లారు.
మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు రెండు రోజల క్రితం నోయిడాలో అడుగుపెట్టారు. అదేవిధంగా సోమవారం మెట్రో రైలు ప్రారంభం సందర్భంగా కూడా నోయిడా వెళ్లారు. యోగీ వ్యవహారశైలిని మోడీ ప్రశంసించారు. యోగీ ఆధునికవాది కాదు అని మాట్లాడుకునేవారందరికీ ఆయన అడుగు కనువిప్పని ప్రధాని అన్నారు.
యోగీ వేసుకున్న దుస్తుల ఆధారంగా ఆయన ఆధునిక వాది కాదని అందరూ అనుకుంటారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం యోగి చేశారని మోడీ ప్రశంసించారు. నోయిడాకు శాపం ఉందన్న విషయం పక్కనబెట్టి ఆయన నగరంలో అడుగుపెట్టారని, నమ్మకం ముఖ్యమని, గుడ్డినమ్మకం ఆహ్వానించదగినది కాదని అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా కొన్ని ప్రాంతాల్లోకి అడుగుపెట్టవద్దని చాలామంది చెప్పారని, కానీ తాను ఆ మాటలు పట్టించుకోలేదని, వారు వద్దన్న ప్రతిచోటులో అడుగుపెట్టి చూశానని తెలిపారు.
ఎన్నో ఏళ్లగా క్షుద్రపూజలపై, మంత్రశక్తులపై, శాపాలపై నమ్మకంతో పలువురు నాయకులు కొన్ని ప్రాంతాల్లో అడుగే పెట్టలేదని, ఇది దురదృష్టకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాంటివి నమ్మి ఆ ప్రాంతానికి దూరంగా ఉండేవాళ్లు అసలు ముఖ్యమంత్రి పదవికే అనర్హులని మోడీ విమర్శించారు.