ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా స్టార్ స్టేటస్ అనుభవించిన హాస్య నటుడు బ్రహ్మానందానికి ఇటీవల అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. అన్ని సినిమాల్లోనూ ఒకే తరహా పాత్రల్లో కనిపించడంతో అభిమానులకు మొహం మొత్తేసింది. దీంతో ఆయన కొంత కాలంగా రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాడు. సినిమా అవకాశాలు తగ్గాయో లేక తనకు తానే సెలక్టివ్ గా ఎంచుకుంటున్నాడో తెలియదు కానీ ఈ మధ్య ఆయన కనిపించడమే గగనం అయ్యింది. ఇక తాజాగా ఆయన ఎన్టీఆర్ బయోపిక్ కధానాయకుడులో రేలంగి పాత్ర పోషించారు. దీంతో ఆయన అభిమానులు సంబరపడ్డారు. అయితే బ్రహ్మానందం ప్రస్తుతం ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్(ఏహెచ్ఐ)లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు గుండె ఆపరేషన్ జరిగినట్లు వార్తలు రావడంతో అభిమానులు కలవరానికి గురయ్యారు.
ఆయన కుటుంబం నుండి స్పష్టమయిన వివాన లేకపోవడం వలన ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. గత ఆదివారం బ్రహ్మానందం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనని వెంటనే ముంబయిలోని ఆసుపత్రికి తరలించారు. గుండెకు సంబంధిత సమస్య ఉండటంతో హార్ట్ సర్జన్ రమా కాంత్ పాండా ఆధ్వర్యంలో డాక్టర్ల టీమ్ ఆయనకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం మీద సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలు జరగడంతో ఆయన కుమారుడు వివరణ ఇవ్వక తప్పలేదు. బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని, వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారని.. కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారని చెప్పుకొచ్చాడు. అయితే బ్రహ్మానందం కుటుంబసభ్యులంతా ప్రస్తుతం ముంబయిలోనే ఉన్నారు. దీంతో ఆయన ఆరోగ్యం మీద ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు.