Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో సంచలనంగా మారిన కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. భార్య వనిత వేధింపులు భరించలేకే విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతుండగా… ఆమె మాత్రం మరో రకం వాదన వినిపిస్తోంది. చాలా రోజులుగా తన భర్తకు హెచ్ ఐవీ ఉందని, ఆత్మహత్యకు అదే కారణం అయి ఉంటుందని ఆమె అంటోంది. అంతేకాకుండా భర్తపై ఆమె అనేక ఆరోపణలు కూడా చేస్తోంది. విజయ్ కు అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉండేదని, వచ్చిన సంపాదనంతా అమ్మాయిలకే ఖర్చు పెట్టేవాడని ఆరోపించింది. ఇలాంటివి మానుకోవాలని తాను ఎన్నోసార్లు చెప్పినా… పట్టించుకోలేదని, తనను ఏనాడూ బాగా చూసుకోలేదని ఆవేదన వ్యక్తంచేసింది. విజయ్, తాను చాలా కాలంగా విడిపోయి బతుకుతున్నామని, రెండేళ్ల నుంచికోర్టులో డైవోర్స్ కేసు నడుస్తోందని తెలిపింది. తాము విడిపోవడానికి గల కారణాన్ని కూడా ఆమె వెల్లడించింది.
విజయ్ కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని, ఆ విషయాన్ని తాను కళ్లారా చూశానని, అప్పటినుంచే తమ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని విజయ్ తల్లిదండ్రులకు కొడుకు గురించి చెప్పినా వారు పట్టించుకోలేదని తెలిపింది. విజయ్ తనను ఎన్నో చిత్రహింసలకు గురిచేశాడని, తాను ఎన్నడూ వాటిని బయటకు చెప్పుకోలేదని, ఆత్మహత్యకు పాల్పడాల్సింది ఆయన కాదని, తానని ఆవేదన వ్యక్తంచేసింది. విజయ్ కు హెచ్ ఐవీ ఉందన్న విషయం ఆయనతో శారీరక సంబంధం పెట్టుకున్న అమ్మాయే తనకు చెప్పిందని, విజయ్ కూడా తనతో చాలా సార్లు ఎక్కువరోజులు బతకబోనని చెబుతుండేవాడని వనిత తెలిపింది. తమ కూతురు వారంలో రెండు రోజులు తండ్రి వద్ద ఉండాలని కోర్టు ఆదేశించిందని, కోర్టు ఆదేశాల మేరకు విజయ్ కూతురుని తీసుకెళ్లాడని, పాపను తీసుకొచ్చేందుకు తాను విజయ్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో తమ మధ్య ఎలాంటి గొడవా జరగలేదని ఆమె చెప్పింది. పాపను విజయ్ కు దూరం చేయలేదని, ఆయన ఏం సంపాదిస్తున్నారో కూడా తాను ఎన్నడూ పట్టించుకోలేదని, పెళ్లి సమయంలో తాను ఇచ్చింది తిరిగి ఇవ్వమని మాత్రమే కోరానని వనిత చెబుతోంది. అయితే మరణించే ముందు విజయ్ సెల్ఫీ వీడియోలో భార్య వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు.
భార్యతో పాటు మరికొంతమంది పేర్లనూ వీడియోలో ప్రస్తావించాడు. తన చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీ, బృందతో పాటు పారిశ్రామిక వేత్త శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ కారణమని ఆరోపించాడు. వీరంతా తనను మానసికంగా హింసించారని, ఎవ్వరినీ వదిలిపెట్టకుండా, అందరికీ శిక్షపడేలా చూడాలని తనతండ్రిని కోరాడు. వాల్ పోస్టర్ అనే సినిమా ద్వారా వనిత పరిచయమైందని, ఆమెకు తనకంటే ముందు అమ్మిరెడ్డి అనే వ్యక్తితో వివాహమైందని విజయ్ వీడియోలో చెప్పాడు. ఇప్పుడు తామిద్దరి మధ్యకు శశిధర్ అనే వ్యక్తి వచ్చాడని, తన కూతురు వనిత వద్ద అలాంటి వాతావరణంలో పెరగడం తనకు ఇష్టం లేదని, పాపను ఆమె దగ్గరనుంచి తీసుకురావాలని విజయ్ కోరాడు. చాలా రోజుల నుంచి తన భార్య నుంచి తాను విడిగా ఉంటున్నానని, తాను యూసఫ్ గూడలో ఉంటుండగా… తన భార్య మణికొండలో ఉంటోందని..చెప్పాడు.
కొంతకాలం క్రితం విడాకుల కోసం తన భార్య కోర్టులో పిటిషన్ వేసిందని, భరణం కూడా కోరిందని, ఈ రెండు కేసుల నుంచి బయటపడాలంటే.. రూ. 3కోట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేసిందని తెలిపాడు. ఈ వ్యవహారానికి సంబంధించి శశిధర్ అనే వ్యక్తితో పాటు అడ్వొకేట్లు వేధింపులకు పాల్పడ్డారని చెప్పాడు. రెండు రోజుల క్రితం తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు కారును కూడా తీసుకెళ్లారని, ఈ క్షోభను తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వీడియోలో చెప్పాడు. విజయ్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అమ్మాయిలు-అబ్బాయిలు, బొమ్మరిల్లు, వరప్రసాద్-పొట్టిప్రసాద్, బృందావనం వంటి చిత్రాల్లో విజయ్ కమెడియన్ గా అందరి గుర్తింపు పొందాడు. ఆయన చివరిగా నటించిన ధనలక్ష్మి తలుపు తడితె సినిమా 2015లో విడుదలయింది.