పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో బుధవారం రోజున లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు ప్రవేశించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న పార్లమెంట్ల సమావేశాలపై ఆసక్తి ఏర్పడింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ఇంత పెద్ద ఘటన జరిగినా ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి నుంచి ప్రకటన రాకపోవడం ఏంటని విపక్షాలు ప్రశ్నించాయి. ఘటనపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
మరోవైపు భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని లోక్ సsభలో నోటీసులు అందజేశారు. రాజ్యసభలో ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా డిమాండ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు.
బుధవారం రోజున ఇద్దరు వ్యక్తులు లోక్ సభ ఛాంబర్లోకి ప్రవేశించడం సంచలనమైంది. జీరో అవర్ జరుగుతున్న సమయంలో విజిటర్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి టియర్ గ్యాస్ రిలీజ్ చేశారు. ‘నియంతృత్వం నశించాలి’ అంటూ సభలో నినాదాలు చేశారు. వారిని ఎంపీలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు.