Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటకలో ముందు నుండి అనుకుంటున్నదే అయ్యింది ఎవరు గెలిచినా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అమిత షా దానికి అనుగుణంగానే పావులు కదిపారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ వజుభాయ్‌వాలా బుధవారం నాడు కోర్టు సమయం ముగిశాక రాత్రి 10 గంటలకు బీజేపీ నేత యడ్యూరప్పను ఆహ్వానించారు. అయితే శాసనసభలో బలనిరూపణకు 15రోజుల గడువు ఇచ్చారు. అయితే అంతకుముందు గవర్నర్‌ను కలిసి, తమ మద్దతుదారుల జాబితా సమర్పించడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరిన కాంగ్రెస్ -జేడీఎస్ లకు ఇది మింగుడు పడని పరిణామంగా చెప్పాలి. దీంతో వజూభాయ్ వాలా బీజేపీకే తొలి అవకాశం ఇవ్వడంతో ఇది రాజ్యాంగంపై జరిపిన ఎన్కౌంటర్ అని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బుధవారం రాత్రి 11:47 గంటలకు అత్యవసరంగా ఓ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అప్పటికప్పుడే వాదనలు వినాలని అభ్యర్థించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వి, వివేక్ తనఖా, పార్టీ లీగల్‌సెల్‌కు చెందిన లాయర్లు- కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నివాసానికి రాత్రి 12:28 గంటలకు చేరుకున్నారు. కర్ణాటకలో ఓ అనైతిక చర్యకి గవర్నర్ పాల్పడ్డారని, గురువారం ఉదయం 9:30కే అర్హత లేని వ్యక్తితో ప్రమాణస్వీకారమని, దీన్ని తక్షణం ఆపాలని, ఈ విషయంలో న్యాయ వ్యవస్థల జోక్యం అనివార్యమని అభ్యర్థించారు. గవర్నర్ నిర్ణయం చెల్లదని ప్రకటించాలని, ఈ ప్రక్రియ నిలుపుచేయాలని అభిషేక్ మనుసింఘ్వి కోరారు. అయితే ముందు అంతగా ఆసక్తి చూపకపోయినా తరువాత వెంటనే వాదనలు వినడానికి అంగీకరించారు. అర్ధరాత్రి 1:45కి ఆరో నెంబరు కోర్టులో విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ముగ్గురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఏర్పాటు చేశారు.
ధర్మాసనంలో జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్ లు ఉన్నారు. జస్టిస్ ఏకీ సిక్రీ నేతృత్వంలోని ఈ బెంచ్ కాంగ్రెస్- జేడీఎస్ సంయుక్తంగా వేసిన ఈ పిటిషన్‌ను పరిశీలించి దీనికి సంబంధించిన వాదనలను లిఖిత పూర్వకంగా వెంటనే సమర్పించాలని ఆదేశించారు. కాంగ్రెస్ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలను అడిగింది. కాంగ్రెస్ తరపున సింఘ్వీ, ప్రభుత్వం తరపున ఏజీ కేకే వేణుగోపాల్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. బీజేపీ, యడ్యూరప్ప తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించడంతో విచారణ వాడి వేడిగా సాగింది. మెజారిటీ ఉన్నవారినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అలాగే బలనిరూపణకు 15 రోజుల సమయం ఇవ్వడం పైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గోవాలో అతిపెద్ద కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన సంగతిని వారు గుర్తుచేశారు. గవర్నరుకు ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వజాలమని సుప్పీంకోర్టు పేర్కొంది. అయితే మెజారిటీ నిరూపించుకోవడానికి అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదా అని ధర్మాసనం వారిని అడిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఒక పార్టీని గవర్నరు పిలవకుండా కోర్టు అడ్డుకోజాలదని ప్రస్తావించింది. దీంతో ఈ పరిస్థితుల్లో మేము ఏమీ జోక్యం చేసుకోలేమని కోర్టు తీర్పు చెప్పగా కాంగ్రెస్ నేతలు ప్రత్యామ్నాయాల వేటలో పడ్డారు. కానీ వారి ప్రయత్నాలని తుంగలో తోక్కేలా ఈరోజు కర్నాటక సీఎం గా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.