Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2004 నుంచి యూపీఏ ప్రభుత్వాన్ని కనుసైగలతో శాసించిన సోనియా కొడుకు రాహుల్ ని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టాలని కలలు కన్నారు. 2014 ఎన్నికల్లో గెలుపు కోసం చివరి నిమిషంలో తెలంగాణ ఏర్పాటు వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్ని చేసినా కాంగ్రెస్ ని జనం దూరం పెట్టారు. మోడీతో పోల్చుకుంటే రాహుల్ వారికి మరగుజ్జులా కనిపించాడు. 2014 ఎన్నికల తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఎప్పటికప్పుడు మోడిదే పైచేయి అయ్యింది. రాహుల్ రాజకీయం జనానికి ఎక్కలేదు. చివరకు గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. అయితే ఆ రాష్ట్ర ఎన్నికల తర్వాత రాహుల్ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రాజస్థాన్ ,పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం చూస్తుంటే గాలి వాలు మారినట్టు అనిపిస్తోంది.
కేంద్ర ఇంటలిజెన్స్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఒక్క యూపీ మినహా ఎక్కడా బీజేపీ పరిస్థితి సానుకూలంగా లేదని తెలిసిందట. వచ్చే ఆరేడు నెలలు, ఏడాది కాలంలో పరిస్థితులు ఇంకా క్లిష్టంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిత్రపక్షాలు కొన్నిటిని బీజేపీ దూరం చేసుకుంటుంటే , మరికొన్ని అవే దూరం అవుతున్నాయి. ఈ రకంగా చూసుకున్నప్పుడు యూపీ లో దెబ్బ పడితే బీజేపీ కి దేశవ్యాప్తంగా 150 స్థానాలు రావడమే కష్టం. ఇక కాంగ్రెస్ సొంతబలం మాట ఎలా వున్నా మోడీ అహంకార ధోరణితో విసిగిపోయిన ప్రాంతీయపార్టీలు తామే ఎదురు వెళ్లి కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే వాతావరణం వుంది. చివరకు కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదుల మీద పుట్టిన టీడీపీ సైతం ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ కి అండగా నిలిచే అవకాశం ఉందట. మొత్తంగా ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే రాహుల్ ని ప్రధాని చేయాలన్న సోనియా ప్రయత్నం నెరవేరకపోయినా మోడీ ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేసేట్టు వున్నాడు.