Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక రాజకీయం హైదరాబాద్ కు చేరుకుంది. బలపరీక్షకు ఇంకా 24 గంటల సమయమే ఉండడంతో బీజేపీ ప్రలోభాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను శర్మ లగ్జరీ బస్సుల్లో హైదరాబాద్ హోటళ్లకు తరలించాయి. బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ రిసార్టులో బసచేసిన జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గురువారం పోలీసులు ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకోవడంతో రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను తొలుత ప్రత్యేక విమానంలో కేరళకు తరలించాలని భావించాయి. అయితే పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్ మార్చారు. చివరి నిమిషం వరకు గోప్యత పాటించి ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ తరలించారు.
తొలుత పార్క్ హయత్ హోటల్ లో ఎమ్మెల్యేలను ఉంచాలని భావించినప్పటికీ… భద్రతాకారణాల రీత్యా జేడీఎస్ ఎమ్మెల్యేలను నోవాటెల్ హోటల్ కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తాజ్ కృష్ణకు తరలించారు. ఈ హోటళ్ల వద్ద హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిణీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. అటు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సాంకేతికతను కూడా వినియోగించుకుంటోంది. ఎమ్మెల్యేలంతా పార్టీ ఏర్పాటుచేసిన హోటళ్లలో బసచేయడంతో ఇక వారిని బీజేపీ నేతలు సంప్రదించడానికి ఉన్న ఏకైక మార్గం ఫోన్ కాల్సే. ఈ ప్రయత్నాలనూ అడ్డుకోవాలంటే ఎమ్మెల్యేల దగ్గరనుంచి ఫోన్ లు తీసుకోవాలి. అయితే కాంగ్రెస్ అలా చేయకుండా ఎమ్మెల్యేలను ఓ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరింది. దీని ద్వారా ఎమ్మెల్యేల ఫోన్ కాల్ సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచన.
ఇప్పటికే బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన ఫోన్ కాల్ సంభాషణలు మీడియాలో ప్రసారమయ్యాయి. బీజేపీ నేతలు గాలి జనార్థనరెడ్డి, శ్రీరాములు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో పరోక్షంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. గౌరిబిదనూరు, పావగడ ఎమ్మెల్యేలు శివశంకర్ రెడ్డి, వెంకటరమణప్పకు వారి సన్నిహితుల ద్వారా బీజేపీలో చేరితో మంత్రిపదవితో పాటు ఎంతో లాభం చేకూరుతుందని ఆశపెట్టినట్టు ఆ సంభాషణలో ఉంది. అటు శనివారం సాయంత్రం నాలుగుగంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన గవర్నర్ బీజేపీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అవసరమైన అన్ని పత్రాలను కాంగ్రెస్ – జేడీఎస్ సమర్పించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు నడుచుకుంటూ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రేపు బలపరీక్షలో తమదే విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ధీమా వ్యక్తంచేశారు. నిజంగా బలం ఉంటే మరింత గడువుకావాలని బీజపీ సుప్రీంకోర్టును ఎందుకు కోరిందని ఆజాద్ ప్రశ్నించారు. మొత్తానికి రేపటితో కర్నాటకానికి తెరపడనుంది. బీజేపీ బలం నిరూపించుకుంటుందా లేక… కాంగ్రెస్, జేడీఎస్ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందా అన్నది తేలనుంది.