Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ లో కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల్లో గెలవడం అనూహ్యం ఏమీ కాదు. కాకుంటే బీజేపీ చేసిన ఓవర్ ఆక్షన్ తో అది కాంగ్రెస్ గెలుపు అనేకన్నా బీజేపీ ఓటమి గానే ముద్రపడిపోయింది. సప్తసముద్రాలు సునాయాసంగా ఈది వచ్చినవాడు ఇంటి వెనుక పిల్ల కాలువలో పడిపోతే ఎలా ఉంటుంది ?. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా ద్వయం పరిస్థితి అలాగే అయ్యింది. అధికారం తలకి ఎక్కినప్పుడు కాలమే దాన్ని కిందకు దించుతుంది అని మరోసారి రుజువు అయ్యింది. మోడీ , షా కి ఇప్పుడు తమకు ఎదురే లేదనుకునే గుజరాత్ లో దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇదేదో కాంగ్రెస్ గెలుపు అనుకోలేము. మోడీ, షా స్వీయ తప్పిదం. తమకు తామే తీసుకున్న గోతిలో పడ్డారు.
2014 లో ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టి లోక్ సభ లో అడుగు పెట్టిన మోడీ ఓ మాట అన్నారు .”రాజకీయమంటే సేవ… ఉత్తమ రాజకీయ విలువలతో రాజకీయాలకు సరైన అర్ధం చెబుతాం”…అని. దశాబ్దాలుగా కాంగ్రెస్ కుటిల రాజకీయాలు చూసీచూసీ విసిగిపోయిన జనానికి ఆ మాటలు అమృతప్రాయంగా తోచాయి. మోడీ నిజంగా కొత్త రాజకీయాలు చేస్తారని ఆశపడిన వారు చాలా మందే వున్నారు. ఆ భ్రమలోనే తొలి ఏడాది ఆయన ఏమి చేసినా ఆ అంతరార్ధం తెలియకపోయినా మోడీ అంతా మనకోసమే చేస్తున్నారు అనుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలుగా నిలిచిన శివసేన, టీడీపీ లకు కూడా అవమానాలు ఎదురు అయ్యాయి. అయితే జాతీయ భావన దృష్టితో నిర్ణయాలు తీసుకున్నారేమో అనుకున్నారు కొందరు. దీంతో అవమానాలు పాలు అయినవాళ్లు కూడా నోరు తెరిచి బయటికి చెప్పలేకపోయారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ మీద బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ రూల్ అంతటా వర్తిస్తుంది అనుకున్నారు. కానీ ఆ పార్టీ అధికారంలో వున్న చోట ఈ రూల్ వర్తించదని ఇప్పటికే చాలా సార్లు తేలిపోయింది. తమిళనాట అధికార పార్టీ తలవంచడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో అందరూ చూసారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ని రాజ్యసభ ఎన్నికల్లో ఓడించడానికి మోడీ, అమిత్ షా ద్వయం చేసిన పనులు చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుంది. ఇంత చేసినా అహ్మద్ పటేల్ గెలుపుని అడ్డుకోలేకపోయారు. ఈ జంట విజయ యాత్ర గుజరాత్ నుంచే మొదలైంది. ఇప్పుడు పటేల్ గెలుపు చూసాక మోడీ, షా పతనం కూడా అక్కడ నుంచే మొదలు అయ్యింది అనిపిస్తుంది.
మరిన్ని వార్తలు: