రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా భూస్థాపితం అయిపోయి జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్ది మంది నేతలు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. మరలా ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాసం కనపడకపోవడంతో తమకు అనుకూలంగా తమకు పనికి వచ్చే పార్టీని చూసుకుని జెండా మార్చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని పవన్ కల్యాణ్ విధివిధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్టు నానాజీ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి మనుగడ లేదని తెలిసినా పార్టీ మారకుండా సేవలు అందించానని కాంగ్రెస్‌లో 32 ఏళ్ల పాటు పనిచేశానని, ఎన్నో పదవులు అధిష్ఠించానని నానాజీ చెప్పుకొచ్చారు. ఆ విశ్వాసంతోనే కాంగ్రెస్‌ను వీడుతున్నా తన వెంట ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాగా, నానాజీ పార్టీ వీడడం జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద షాకేనని చెబుతున్నారు. అయితే, పార్టీ టికెట్‌ను మాత్రం ఆశించడం లేదని పేర్కొన్న నానాజీ జనసేన విధివిధానాలు తనకు నచ్చాయని పవన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరుతానని నానాజీ తెలిపారు.