Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహిళా కానిస్టేబుల్ చెంప పగులగొట్టి..ఆపై ఆమె చేతిలో చెంపదెబ్బ తిన్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశాకుమారి క్షమాపణలు చెప్పారు. తాను కానిస్టేబుల్ ను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. అదే సమయంలో కానిస్టేబుల్ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిమ్లాలో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాల్గొనడానికి ఆశాకుమారి కార్యాలయం వద్దకు వచ్చారు. ముందుగా అనుకున్నవారిని తప్పితే మిగతా ఎవ్వరినీ సభకు అనుమతించవద్దని ఆదేశాలు ఉండడంతో పోలీసు సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. పోలీసుల తీరుతో ఆగ్రహానికి గురైన ఆశాకుమారి వారితో వాగ్వాదానికి దిగారు.
అంతటితో ఆగకుండా మహిళా కానిస్టేబుల్ చెంపపగలగొట్టారు. వెంటనే స్పందించిన ఆ కానిస్టేబుల్ కూడా అంతేవేగంగా మహిళా ఎమ్మెల్యే చెంపపై తిరిగి కొట్టారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. ఆశాకుమారి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోగా…కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే, కానిస్టేబుల్ ఒకరినొకరు కొట్టుకున్న దృశ్యాలు మీడియా కంటికి చిక్కడంతో చానళ్లు పదే పదే ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలోనూ ఇది వైరల్ గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆశాకుమారి స్పందించారు.
కానిస్టేబుల్ పై చేయిచేసుకున్నందుకు క్షమాపణలు చెబుతూనే…ఆమె తీరును తప్పుబట్టారు. కానిస్టేబుల్ తనను తిట్టిందని, తోసివేసిందని ఆరోపించారు. తనను వెళ్లకుండా నిలువరించాలనుకుంటే వేరే పద్ధతిలో చెప్పవచ్చని..ఇలా చేయకూడదని మండిపడ్డారు. ఆమె తల్లికున్న వయసు తనకుంటుందని, ఆ వయసుకయినా గౌరవం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. తాను కూడా ఆవేశంలో తప్పుగా ప్రవర్తించానని ఆశాకుమారి అంగీకరించారు. ఆ సమయంలో తాను సహనాన్ని కోల్పోకుండా ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవాల్సిందన్న ఆమె అందుకు క్షమాపణలు చెబుతున్నానని మీడియాకు చెప్పారు. మొత్తానికి ఈ అంశంలో ఆశాకుమారి హుందాగా వ్యవహరించారన్న అభిప్రాయం వినపడుతోంది. కానిస్టేబుల్ తనను కొట్టినప్పటికీ…ఆశాకుమారి క్షమాపణ చెప్పి…తనపై విమర్శలు పెరగకుండా జాగ్రత్తపడ్డారని భావిస్తున్నారు.