వ్యక్తి పూజ సంస్కృతి అనేది కాంగ్రెస్ లో సర్వ సాధారణం ఆ పార్టీ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ మొదలుకుని రాహుల్ గాంధీ దాకా వ్యక్తి పూజ అనేది పార్టీనుండి తరిమేద్దామని తెగ ప్రయత్నిస్తుంటారు అయితే వారి పార్టీ నేతలు మాత్రం అలాంటిది ఏదో ఒకటి చేసి వారి పరువు తీస్తూ ఉంటారు. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత ఊర్మిళ సింగ్ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో, ఆమెకు కమల్ నాథ్ నివాళి అర్పించారు. అనంతరం ఆయన కాళ్లకు ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్ బూట్లు తొడిగారు. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై రజ్నీష్ సింగ్ స్పందిస్తూ… కమల్ నాథ్ తనకు తండ్రిలాంటి వారని చెప్పారు. నేను చదువుకుంటున్న రోజుల నుంచి ఆశీర్వాదం కోసం ఆయన కాళ్లను తాకుతూనే ఉన్నానని అన్నారు. ఆయనతో తన కుటుంబానికి, ముఖ్యంగా తన తండ్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమల్ నాథ్ నివాళి అర్పించినప్పుడు అక్కడ ఎంతో మంది ఉన్నారని… దీంతో బూట్లు ఎక్కడున్నాయో కనిపెట్టడం ఆయనకు కష్టమైందని… ఈ క్రమంలో, తాను బూట్లు తీసుకొచ్చి, ఆయన పాదాలకు తొడిగి, సహాయం చేశానని చెప్పారు. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. పాపం ఇంత కవరింగ్ ఇచ్చినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది మరి ఏమి చేస్తాం !