Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల కోసం చేయబోతున్న పోరాటానికి కాంగ్రెస్ ను కలుపుకుపోదామన్న జనసేనాని ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏపీలో అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ పవన్ తో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి కనబర్చటం లేదు. విభజన హామీలు, ఇతర అంశాల సాధన కోసం కలిసికట్టుగా పోరాడదామన్న పవన్ ప్రతిపాదనకు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెంటనే అంగీకరించారు కానీ…కాంగ్రెస్ మాత్రం స్పందించడం లేదు. రెండు రోజుల క్రితం రఘువీరారెడ్డితో మాట్లాడేందుకు పవన్ ఫోన్ చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ ఉదయం మరోసారి ఫోన్ చేశారు. తాను ఏర్పాటు చేయదల్చిన జేఎఫ్ సీకి మద్దతివ్వాలని, శుక్రవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు.
ఏపీకి న్యాయం జరిగేలా కేంద్రప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే అంశంపై సమావేశంలో చర్చించనున్నామని తెలిపారు. పవన్ ప్రతిపాదనను రఘువీరా రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అయితే సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ ను పంపుతామని పవన్ కు రఘువీరారెడ్డి తెలియజేసినట్టు కాంగ్రెస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. మొత్తానికి ఓ మిత్రపక్షంలా పవన్ తో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఈ పరిణామం తెలియజేస్తోంది