Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల ఫలితాల విశ్లేషణ పక్కన పెడితే 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓ అంశంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీజేపీ గెలుస్తూ బలమైన రాజకీయపక్షంగా ఆవిర్భవిస్తోంటే… కాంగ్రెస్ మాత్రం ఒక్కొక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతూ బలహీనంగా మారుతోంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టే సమయంలో బీజేపీ ఏడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. మూడేళ్లు దాటేసరికి అనేక రాష్ట్రాల్లో వరుస విజయాలతో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 19కు చేరింది. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయింది.
పంజాబ్, కర్నాటక, మేఘాలయ, మిజోరం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాల ప్రభావం దేశరాజకీయాల్లో అంతంత మాత్రమే అనుకుంటే… చెప్పుకోదగ్గ ఒక్క రాష్ట్రం కాంగ్రెస్ కు కర్నాటక మాత్రమే. అక్కడ కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, మిజోరం అసెంబ్లీల గడువు కూడా వచ్చే ఏడాదితో ముగుస్తుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కచ్చతంగా చెప్పలేం. దక్షిణాది రాష్ట్రాల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న బీజేపీ… కర్నాటకలో గెలుపుకు ఇప్పటినుంచే వ్యూహాలు మొదలుపెట్టింది. మేఘాలయ, మిజోరంలలో ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చే ఏడాది విజయం సాధిస్తే… కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాహుల్ గాంధీ సారధ్యంలో ఒకే ఒక్క రాష్ట్రంలో అధికారానికి పరిమితమయ్యే పరిస్థితి ఎదుర్కొంటుంది. అయితే రాహుల్ అలా జరగనివ్వబోరనే వాదనా వినిపిస్తోంది. కర్నాటకలో పార్టీని గట్టెక్కించే బాద్యతను పూర్తిగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వదిలిపెట్టిన రాహుల్ మేఘాలయ, మిజోరంలోనూ పార్టీకి అధికారం నిలబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అదే సమయంలో బీజేపీ మాత్రం ఈ మూడు రాష్ట్రాల్లో హస్తం పార్టీని అధికారానికి దూరం చేసి కాంగ్రెస్ ముక్తభారత్ సాధన దిశగా తొలి అడుగు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.